లోకల్ ట్రైన్ డ్రైవర్ సాహసం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లోకల్ ట్రైన్ డ్రైవర్ సాహసం

హైద్రాబాద్, ఫిబ్రవరి 20  (way2newstv.com): 
వాహనాలను నడిపేవారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రజా రవాణా వాహనాలను నడుపుతున్నప్పుడు ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టమూ భారీగా సంభవించే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు డ్రైవర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక ప్రమాదాలను నివారిస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ముంబయిలోని ఓ లోకల్ ట్రైన్ డ్రైవర్ అలాంటి సాహసాన్నే ప్రదర్శించి అధికారుల మన్ననలు పొందాడు.  మధ్యాహ్నం ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్టేషన్ నుంచి టిట్వాలాకు లోకల్ ట్రైన్ బయలుదేరింది. 


లోకల్ ట్రైన్ డ్రైవర్  సాహసం

రైలు కాల్వా స్టేషన్ దాటిన వెంటనే కొందరు ఆకతాయిలు డ్రైవర్ క్యాబిన్‌లోకి కారం పొడి విసిరారు. దీంతో డ్రైవర్ లక్ష్మణ్ సింగ్ కళ్లలో కారంపొడి పడింది. ఈ విషయాన్ని అతడు వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారమిచ్చాడు. అయితే ఈ పరిస్థితుల్లో మరో డ్రైవర్ రావడం కుదరదని ముంబయి స్టేషన్ అధికారులు చెప్పడంతో తీవ్రంగా బాధపడుతూనే అతడు సుమారు 18 కిలోమీటర్లు రైలును నడిపి దివా స్టేషన్‌కు చేర్చాడు. డీవై స్టేషన్ సూపరింటెండెంట్ రైలు కేబిన్లో ప్రయాణించి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించారు. డ్రైవర్ చూపించిన ధైర్య సాహసాలకు మెచ్చిన సెంట్రల్ రైల్వే అధికారులు రూ.వెయ్యి నగదు ప్రోత్సాహకంతో పాటు ఓ సర్టిపికెట్‌ కూడా అందజేశారు.  రైలు 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. దీనిపై వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చాను. అయితే వెంటనే మరో డ్రైవర్‌ వచ్చే పరిస్థితి లేకపోవడంతో బాధను భరిస్తూనే రైలును తర్వాతి స్టేషన్‌కు చేర్చాను. ఒకవేళ నేను రైలును మధ్యలోనే నిలిపేస్తే వెనుక వచ్చే రైళ్లకు అంతరాయం కలుగుతుంది. దీని ప్రభావం లక్షల మంది ప్రయాణికులపై పడుతుంది. అందుకే బాధను భరిస్తూనే రైలును నడిపాను’ అని చెప్పుకొచ్చాడు లక్ష్మణ్.