50 అసెంబ్లీలకే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

50 అసెంబ్లీలకే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

నెల్లూరు, మార్చి 5, (way2newstv.com)
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు టిక్కెట్ల ఖారారు విషయంలో ఈసారి కొంత దూకుడుగానే ఉన్నారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను కొందరిని ఖరారు చేశారు. ఇప్పటి వరకూ దాదాపు పన్నెండు పార్లమెంటు నియోజకవర్గాలను సమీక్ష చేసిన చంద్రబాబు దాదాపు యాభై మందికి మాత్రమే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి నలుగురు నుంచి ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ఇప్పటి వరకూ ఖరారు చేశారు. వీరితో నేరుగా మాట్లాడి ప్రచారం చేసుకోవచ్చని సూచించారు. అయితే గట్టిపోటీ, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెట్టేశారు. అక్కడ నేతలందరితో తాను స్వయంగా మాట్లాడిన తర్వాతనే ఖరారు చేయాలని భావిస్తున్నారు.కొన్ని కీలక నియోజకవర్గాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారుతున్నాయి. 


 50 అసెంబ్లీలకే  చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

ఇక్కడ అభ్యర్థులను ఖరారు చేయాలంటే పెద్ద కసరత్తే చేయాల్సి ఉంది. అందరినీ సంతృప్తి పర్చే విధంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీరిలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో బాబుకు ఇబ్బందులు తప్పేలా లేవు. పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. కడప పార్లమంటు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా మంత్రి ఆదినారాయణరెడ్డిని ఖరారుచేశారు. ఈ నియోజకవర్గంలోని శాసనసభ అభ్యర్థుల ఎంపికలో ఆయన అంగీకారాన్ని కూడా చంద్రబాబు తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకే కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలను పెండింగ్ లో పెట్టారు. బద్వేలు, కడప, ప్రొద్దుటూరు స్థానాలకు ఎవరిని అభ్యర్థులను ప్రకటించలేదు. బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు వైసీపీ నుంచి టీడీపీలో వచ్చి చేరారు. అయితే ఇక్కడ స్థానిక టీడీపీ నేతలకు ఆయనకు పొసగడం లేదు. మరోనేత లాజరస్ బద్వేలు సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. కడప నియోజకవర్గంలో మాజీ మంత్రి అహ్మదుల్లా కుమారుడు అష్రాఫ్ పేరును ఖరారు చేద్దామనుకున్నా అక్కడజిల్లాపార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి అంగీకరించడం లేదు. ఇక ప్రొద్దుటూరులోనూ మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులు రెడ్డి, లింగారెడ్డిల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక్కడ ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు.కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల పరిస్థితి అంతే. ఇక్కడ కోట్ల కుటుంబం చేరడంతో సమీకరణాలు మారనున్నాయి. దీంతో కర్నూలు, ఆదోని, కోడుమూరు, నంద్యాల, పాణ్యం, నందికొట్కూరు స్థానాల అభ్యర్థుల ఎంపిక పెండింగ్ లో పెట్టారు. నంద్యాల సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డితో పాటుగా ఏవీ సుబ్బారెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్లిలు కోరుతున్నారు. ఇక కర్నూలు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ భరత్ ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. గౌరు కుటుంబం పార్టీలో చేరితే పాణ్యం టిక్కెట్ వారికిచ్చేందుకు పెండింగ్ లో ఉంచారు. నందికొట్కూరు టిక్కెట్ కూడా గౌరు కుటుంబం సిఫార్సు చేసిన వారికే ఇవ్వాలని నిర్ణయంచారు. కోట్ల సతీమణి సుజాతమ్మకు ఆలూరు టిక్కెట్ దాదాపుగా ఖాయమైనట్లే. కోడుమూరులో కోట్ల సిఫార్సు చేసిన వారికే టిక్కెట్ దక్కే ఛాన్సుంది. ఆదోని సీటు మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడికి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నా ఎంపీ బుట్టారేణుక తనకు టిక్కెట్ కావాలని అడుగుతుండటంతో దానిని కూడా పెండింగ్ లో పెట్టారు.రాజంపేట పార్లమెంటు పరిధిలో తంబళ్లపల్లి, మదనపల్లి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. తంబళ్ల సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ టిక్కెట్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంటు పరిధిలోని కనిగిరి, యర్రగొండపాలెం, బాపట్ల, చీరాల నియోజకవర్గాలను చంద్రబాబు పెండింగ్ లో ఉంచారు. కనిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ను కాదని కొత్తగా వస్తున్న ఉగ్రనరసింహారెడ్డికి ఇవ్వాలనుకుంటున్నారు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో అక్కడ అభ్యర్థి ఎంపికను చేయలేదు. యర్రగొండపాలెంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కు అక్కడ గట్టి పోటీ ఉంది. అక్కడ అజితరావు పోటీ పడుతుండటంతో ఇక్కడ కూడా పెండింగ్ లో పెట్టేశారు. ఏలూరు, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని చింతలపూడి, పోలవరం, తాడేపల్లి గూడెం, నూజివీడు,కైకలూరు స్థానాలకు అభ్యర్థులను ఖారారుచేయలేదు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక తిరువూరును మాత్రమే పెండింగ్ పెట్టారు. తిరువూరు నుంచి మంత్రి జవహర్ న బరిలోకి దింపాలన్నయోచనలో ఉండటమే ఇందుకు కారణం.