అమరావతి, మార్చి 21 (way2newstv.com)
వైకాపా నేత జగన్ సమాజానికే పెనుప్రమాదంగా మారారని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. గురువారం ఎలక్షన్ మిషన్ 2019పై సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, బాధ్యులు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్యపై నాటకాల మీద నాటకాలాడుతున్నారన్నారు. విశాఖలో కోడికత్తి సంఘటన ఇంకో నాటకమాడారని అన్నారు. తెలుగుదేశం డేటా చోరీకి భారీ కుట్ర చేశారన్నారు.
వివేకా హత్యపై నాటకాలు
ఫారం-7 ద్వారా 9లక్షల ఓట్ల తొలగింపు ఇంకో కుట్ర అని అన్నారు. వైసీపీ నేతలకు ఏమాత్రం పౌరుషం, రోషం ఉన్నా, వాళ్లు బీజేపీకి బీ-టీమ్, కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ కాదని ఏపీ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ కుట్రలు, నాటకాలకు అంతే లేకుండా పోయిందన్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థులకు ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అని అంటున్నారని, అలాంటివాళ్లను గెలిపిస్తే ఏం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. అవిశ్వాసంలో మోదీని గెలిపించేందుకే వైసీపీ ఎంపీల రాజీడ్రామా ఆడారని ఆయన విమర్శించారు. మైండ్ గేమ్ తోనే ఆదాల, అవంతి, ఆమంచి, మాగుంటలను లాక్కున్నారని మండిపడ్డారు. మోదీ, కేసీఆర్, జగన్ కుట్రలకు ప్రజలు తగిన బుద్ధిచెప్పాలన్నారు.