కేసీఆర్ మంత్రాన్నే నమ్ముకున్న బాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేసీఆర్ మంత్రాన్నే నమ్ముకున్న బాబు

విజయవాడ, మార్చి 26 (way2newstv.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడే సమయంలో నారా చంద్రబాబునాయుడు స్పీడ్ పెంచారు. ముఖ్యంగా కేసీఆర్ మంత్రంతోనే ఆయన మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నట్లుంది. ప్రత్యేక హోదా విషయం పూర్తిగా పక్కన పెట్టేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రినే చంద్రబాబు టార్గెట్ గా చేసుకోవడం ఇక్కడ గమనించ దగ్గ విషయం. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమాగాచెబుతూనే కేసీఆర్ వల్ల ఏపీకి ఎంత ప్రమాదం భవిష్యత్తులో ఉందనేది తన ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు చెప్పుకొస్తున్నారు.జగన్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ కు ఓటేసినట్లేనని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. కేసీఆర్ జగన్ బొమ్మగా పెట్టి ఏపీని కూడా ఏలాలన్న ఆలోచనతో ఉన్నారని చంద్రబాబు చెబుతున్నారు. కేసీఆర్ పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికీ అడ్డుపడుతున్నారని, ఇటీవలే సుప్రీంకోర్టులో పోలవరానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ఉదహరిస్తున్నారు. 


కేసీఆర్ మంత్రాన్నే నమ్ముకున్న బాబు

ఒక అడుగు ముందుకేసి పోలవరం ముంపుప్రాంతాల్లో ఉన్న ఏడు మండలాలను తిరిగి కేసీఆర్ తెలంగాణలలో చేర్చుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారన్నది టీడీపీ అభియోగం.కొద్దిరోజులుగా ప్రచారం చూస్తుంటే పూర్తిగా సెంటిమెంట్ పైనే చంద్రబాబు ఆధారపడిఉన్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ ఎన్నికల్లో సరిగ్గా ఇలాగే కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రాగలిగారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో మహాకూటమి వస్తే ఆంధ్రోళ్ల పెత్తనం పెరుగుతుందని, సాగర్ జలాలు కూడా తెలంగాణకు చేరవని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కొందరు టీడీపీ నేతలు ఉదహరిస్తున్నారు. అందుకే ఏపీలో కూడా సెంటిమెంట్ రెచ్చగొట్టి ఓట్ల పంట పండించాలన్నది చంద్రబాబు వ్యూహంగ ఉంది.చంద్రబాబు అంచనా ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి తనను తిట్టిపోయాలని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందే కేసీఆర్ తనను తిడితే ఆంధ్రప్రదేశ్ లో తనకు మరింత మైలేజీ పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం తనపై ఎన్ని ఆరోపణలు చేసినా మీడియా ముందుకు రాలేదు. అలాగే ఎన్నికల ప్రచార సభల్లో సయితం చంద్రబాబు, టీడీపీపైనా విమర్శల జోరు తగ్గించారు. మరి ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ తనను రక్షిస్తారని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. ఏపీలో ఈ సెంటిమెట్ వర్క్ అవుట్ అవుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.