ఖమ్మం, మార్చి 2 (way2newstv.com):
సుబాబుల్, జామాయిల్ రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలాగా మారింది. ‘సాగు చేయండి.. ఫలసాయం పొందండి’ అంటూ ఐటీసీ పరిశ్రమ ప్లాంటేషన్ విభాగం హంగామా చేసిన విషయాన్ని రైతులు గుర్తుచేస్తున్నారు. తీరా పంట చేతికి వస్తే పర్మిట్ ఆర్డర్(పి.ఆర్.) దొరక్క ఆందోళనకు గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడి రాక.. కర్ర అమ్ముడుపోక.. ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుబాబుల్, జామాయిల్ సాగవుతోంది. ఖమ్మం జిల్లా మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు, కామేపల్లి తదితర మండలాల్లో సుబాబుల్‌ను సాగు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, అశ్వాపురం, దుమ్ముగూడెం, అశ్వారావుపేట, ములకలపల్లి, దమ్మపేట, ఖమ్మం జిల్లా వేంసూరు, కల్లూరు, పెనుబల్లి తదితర మండలాల్లో జామాయిల్ సాగవుతోంది. ఉభయ జిల్లాల్లో సుబాబుల్ సుమారు 60 వేల ఎకరాల్లో, జామాయిల్ 62 వేల ఎకరాల్లో వేశారు. కర్ర నరికే సమయం రావడంతో రైతులు పర్మిట్ ఆర్డర్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు 2 వేల వరకు దరఖాస్తులు చేసుకున్నారు.
ముందునుయ్యి వెనుక గొయ్యి (ఖమ్మం)
ఏ రైతు వెళ్లి తమకు పి.ఆర్. గురించి ప్రశ్నిస్తే సీరియల్ రాలేదన్న సమాధానం వినిపిస్తోంది. దీంతో విసిగి వేసారి ఆందోళన బాట పడుతున్నారు. పంట సాగు చేసుకుంటే టన్నుకు రూ.6 వేల వరకు వస్తుందని, ఫలితంగా రూ.4 వేల వరకు చేతికి వస్తాయని ప్రచారం చేసిన విషయాన్ని రైతులు గుర్తుచేస్తున్నారు. 2014-15లో పంట సాగు చేయాలని విపరీతంగా ప్రచారం చేశారని, లాభం వస్తుందన్న ఆశతో చేస్తే కర్ర కొనుగోలుకు అనుమతులు రావడంలేదని వాపోతున్నారు.
సుబాబుల్ అమ్మకాల్లో దళారులు రాజ్యం కొనసాగుతోంది. వారికే పెద్దపీట వేస్తున్నారు. రైతులకు అందాల్సిన సొమ్ము కూడా దళారుల కారణంగా అందడం లేదు. పంట నరికివేత, రవాణా, ఎగుమతి, దిగుమతికి అయ్యే ఖర్చులు కూడా తడిసిమోపడవుతున్నాయి. టన్ను కర్ర పరిశ్రమకు తరలించాలంటే.. రూ.1,500 నుంచి రూ.1,900 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. రైతులు నేరుగా లారీల్లో సరకు తెస్తే మరిన్ని రోజులు పడిగాపులు కాసేలా పరిస్థితులను సృష్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కావాలనే ఆలస్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. రోజులవారీగా లారీలకు కిరాయి చెల్లించాల్సి వస్తోంది. రైతులు ఎంతకో కొంతకు సాగు ప్రాంతంలోనే దళారులకు కర్రను అమ్మేస్తున్నారు. సరకు కొన్న దళారులు, ఏజెంట్లు మాత్రం లాభాలు గడించేస్తున్నారు.
రైతులు పరిశ్రమ వద్దకు వెళ్లి నేరుగా అమ్మకాలు చేస్తే ఎన్ని రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుందో తెలిసి వచ్చింది. కొన్నేళ్లుగా ఆయా తతంగాలను దగ్గరుండి చూసిన రైతులు విసిగిపోయారు. నేరుగా కర్రను తెస్తే కావాలనే సతాయిస్తున్నారన్న విషయం గ్రహించారు. విధిలేని పరిస్థితుల్లో దళారులు, ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. టన్నుల ‘లెక్క’న వారికి అమ్మేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని దళారులు, ఏజెంట్లు రైతు కర్రను కొట్టి నేరుగా పరిశ్రమకు తరలించేస్తున్నారు. అలా జిల్లాలో రైతులకు దక్కుతున్న ధర ఏమాత్రం ఆశాజనకంగా లేదు. గతంలో కర్ర నేరుగా రైతులే పరిశ్రమకు తరలిస్తే అన్ని ఖర్చులుపోను టన్నుకు కనిష్ఠంగా రూ.5 వేల వరకు మిగిలేది. నేడు సాగు ప్రాంతంలోనే కర్రను దళారులకు, ఏజెంట్లకు అమ్మేస్తే టన్నుకు రూ.2,400 నుంచి రూ.3,100 వరకు మాత్రమే పలుకుతుందడం బాధాకరం. పరిశ్రమ సమీపంలో ఉండటంతో బూర్గంపాడు మండలంలోని రైతు చేతికి మాత్రం రూ.3,300 వరకు అందుతోంది.
Tags:
telangananews