నియామకాల్లో నిర్లక్ష్యమేలా..? (కరీంనగర్)

కరీంనగర్, మార్చి 2 (way2newstv.com): 
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీలో పారదర్శకంగా వ్యవహరిస్తుంటే జిల్లా యంత్రాంగం మాత్రం ఉత్తర్వుల అమలులో మీనమేషాలు లెక్కిస్తోంది. గతంలో ప్రభుత్వ నిర్ణయమే తరువాయి డీలర్ల నియామకం చేపడతామన్న యంత్రాంగం తీరా ఆదేశాలొచ్చినా చలనం లేకపోవడం దేనికి సంకేతం.. ఖాళీ రేషన్‌ దుకాణాలను గుర్తించి డీలర్ల నియామకానికి ప్రకటన వెలువరించాల్సి ఉండగా నాలుగు నెలలు దాటినా చర్యలు కరవయ్యారు. ఇప్పటికే ఈ-పొస్‌  తో రేషన్‌ సరకుల అక్రమ రవాణాకు 60 శాతం అడ్డుకట్టపడగా బినామీ డీలర్ల నిర్వాకంతోనే ప్రభుత్వానికి అపఖ్యాతి వస్తోంది. ఈ నేపథ్యంలో దుకాణం నిర్వహించకుండా ప్రైవేట్‌ వ్యక్తుల ద్వారా సరకులు పంపిణీ చేస్తున్నవారిని గుర్తించి ఖాళీ పోస్టులను ప్రకటించాల్సి ఉండగా నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. డీలర్లకు కమిషన్‌ పెంపు, బకాయిల చెల్లింపు వంటి చర్యలతో యువత రేషన్‌ డీలర్‌షిప్‌ కావాలని కోరుతున్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన డీలర్ల నియామకం చేపట్టాల్సి ఉండగా శాఖల మధ్య సమన్వయం లేకపోవడం హాస్యాస్పదం..


నియామకాల్లో నిర్లక్ష్యమేలా..? (కరీంనగర్)

తూకంలో తేడాలు.. బియ్యం అక్రమ రవాణా వంటి ఘటనల క్రమంలో 6ఏ కేసులు నమోదు చేస్తున్న అధికారులు పక్క దుకాణ డీలర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నారు. రేషన్‌ దుకాణాల్లో తనిఖీల ప్రక్రియనే పౌరసరఫరాల శాఖ మర్చిపోయింది. కేసులు నామమాత్రమే.. టాస్క్‌ఫోర్స్‌, విజిలెన్స్‌ వంటి విభాగాలు మూకుమ్మడి దాడులు చేసిన కేసులే ఎక్కువ.. అయితే ఒక్కో వ్యక్తి రెండు నుంచి నాలుగు దుకాణాలను నిర్వహిస్తున్నారంటే వారి హస్తలాఘవం ఏ స్థాయిలో ఉందో.. యంత్రాంగ సహకారం మరెంత ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇతర జిల్లాల్లో రేషన్‌ డీలర్ల నియామకం పూర్తవగా జిల్లాలో సదరు ప్రక్రియే లేకపోవడం కార్డుదారులకు శాపంగా మారుతోంది. ఈ-పొస్‌కు ముందు ఇతర వ్యక్తులను నియమించుకొని డీలర్లు సరకులను పంపిణీ చేయించారు. ప్రస్తుతం వేలిముద్ర ద్వారా సరకులు ఇవ్వాల్సి రావడంతో ప్రైవేట్‌ వ్యక్తులు ఇతర వ్యక్తులను నియమించుకొని పంపిణీ చేస్తున్నారు. సాంకేతిక సమస్య వచ్చినపుడు అసలు డీలర్‌ను పిలుస్తుండగా కార్డుదారులకు పడిగాపులు తప్పడం లేదు. ఏళ్ల తరబడి ఇన్‌ఛార్జి డీలర్లకే బాధ్యతలు అప్పగిస్తూ చోద్యం చూడటం విమర్శలకు తావిస్తోంది.
రేషన్‌ దుకాణాల్లో ప్రవేశపెట్టిన ఈ-పొస్‌ విధానం జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. ప్రస్తుతానికి పౌరసరఫరాల శాఖ అధ్వర్యంలో రేషన్‌ దుకాణాల్లో బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 3.17 లక్షల మంది లబ్ధిదారులకు 487 దుకాణాల ద్వారా ప్రతినెలా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందులో 15-20 శాతం బియ్యం ఆదా అవుతోంది. అంటే 700 నుంచి 900 మెట్రిక్‌ టన్నుల బియ్యం ప్రభుత్వానికి మిగులుతోంది. గతంలో ఎవరైనా లబ్ధిదారు ఈ నెలలో బియ్యం తీసుకోని క్రమంలో వచ్చే నెలలో రెండు నెలల బియ్యం పంపిణీ చేసేవారు.. ఈ-పొస్‌ యంత్రాలు రావడంతో ఏ నెల బియ్యం ఆ నెలలోనే ఇస్తున్నారు. అనివార్య కారణాలతో ఎవరైనా లబ్ధిదారు బియ్యం తీసుకోకుంటే ఆ బియ్యం ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తున్నారు.
రేషన్‌ దుకాణాల్లో కార్డుదారుల సంఖ్య సమంగా ఉండాలన్న ఉద్దేశంతో 2016లో హేతుబద్ధీకరణ చేపట్టారు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ యంత్రాంగం రేషన్‌ దుకాణాలు, కార్డుదారుల సంఖ్యను పరిశీలించింది. ఒక్కో దుకాణంలో గరిష్ఠంగా 1500 కార్డులుండగా అత్యల్పంగా 500 కార్డులున్న దుకాణాలున్నాయి. దీంతో ఎక్కువ కార్డులున్న చోట నుంచి ఇతర దుకాణాలకు బదలాయించేందుకు చర్యలు తీసుకునే క్రమంలో జిల్లాల విభజన తెరపైకి రావడంతో సదరు ప్రక్రియకు బ్రేక్‌ పడింది. జిల్లా విభజన జరిగి రెండేళ్లు దాటినా మళ్లీ హేతుబద్దీకరణపై దృష్టిసారించడం ఆరోపణలకు తావిస్తోంది.
Previous Post Next Post