రాజమండ్రి, మార్చి 14, (way2newstv.com)
ఆసియా ఖండం చిత్తడి నేలల్లో నీటి ఆవాసిత పక్షి జాతుల్లో తగ్గుముఖం కన్పిస్తోంది. అటవీ శాఖ ఎగ్రి ఫౌండేషన్ రెండు రోజుల పాటు నిర్వహించిన ఆసియా ఖండంలోని చిత్తడి నేలల పక్షి గణన పూర్తయింది. జీవ వైవిధ్యానికి సంబంధించిన ఈ గణన అవసరమైన చర్యలకు దోహదపడుతుంది. రెండు రోజుల పాటు శాస్ర్తియ విధానంలో నిర్వహించిన గణనలో అనేక మంది పక్షి, జంతు ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, పరిశోధకులు, అభ్యాసకులు, అధ్యాపకులు పాల్గొన్నారు. మొత్తం 23,779 పక్షులను గణన చేయగా అందులో 85 జాతులను మాత్రమే గుర్తించగలిగారు. 34 వలస జాతులుగాను, 30 స్థానిక జాతులుగాను, 5 స్థానిక వలస జాతులుగాను, 57 జాతులు సుస్థిర జాతులుగానూ గుర్తించారు. 17 జాతులను అంచనా వేయలేదు. ఇందులో 10 జాతులు ప్రమాదం అంచునకు చేరాయి. సూపర్ డేంజర్‌లో ఉన్న ఒక జాతి ఇక్కడే కన్పించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదంలో ఉన్న పక్షిజాతిని తూర్పు గోదావరి జిల్లాలోనే ఈ గణనలో గుర్తించడం విశేషంగా నిలిచింది. ఈ గణనలో సాధారణంగా కనిపించని పక్షులు సైతం కన్పించాయి. అంతరించిపోవడానికి సిద్ధంగా వున్న ‘స్పూన్‌బల్ ప్లెటీరియా యూకోరోడియా’ అనే పేరుగల పక్షి అసలు కనిపించలేదు. ‘ఆయస్టర్‌కేచర్ ఎమెటోసిస్ ఎస్ట్రాలజిస్’ అనే పక్షులు కేవలం పదింటిని మాత్రమే ఇక్కడ గుర్తించగలిగారు.
డేంజర్ లో చిత్తడి నేలల పక్షులు
గతంలో ఎపుడూ కన్పించని ‘ఎల్లోబిటన్లోబ్రిడ్జెస్సిసె సిస్’ అనే పక్షి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన గణనలో గుర్తించడం విశేషంగా రికార్డుకెక్కింది. ప్రస్తుతం పక్షి జాతుల లెక్కలను బట్టి 2017 గణనతో పోల్చితే నీటి ఆవాసిత పక్షిజాతుల్లో స్వల్పంగా తగ్గుదల కన్పించిందని రూఢీ అయింది. ఈ పక్షుల సంబంధం ఆధారంగా పర్యావరణంలో మార్పులు, జీవ వైవిధ్యంలో తేడాలను బట్టి మిగిలిన ప్రాణుల స్థితిగతులను అంచనా వేస్తారు. 1967 నుంచి యూరప్ కేంద్రంగా పక్షి జాతుల గణన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆసియన్ నీటి పక్షుల గణన నిర్వహిస్తున్నారు. ప్రతీ ఏడాది రెండు రోజుల పాటు గణన నిర్వహించి ఈ నివేదికల ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణ చేపడుతున్నారు. ప్రత్యేకించి ఏసియా నీటి పక్షుల గణన 1987 నుంచి మొదలైంది. ఆసియాలోని 27 దేశాల్లో ఆరు వేల చిత్తడి నేలల్లో గణన నిర్వహిస్తున్నారు. ఆసియాలోని ఆరు వేల చిత్తడి నేలల్లో తూర్పు గోదావరి జిల్లాలోని కోరింగ అభయారణ్యం ఒకటి. ఈ ప్రాంతంలోనే వేలాది మంది స్వచ్చంద సేవకులు శాస్ర్తియ విధానంలో పక్షి గణన నిర్వహించారు. ఎగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొత్తం 321 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ గణన నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం 1996లో 236 రకాల జాతులు కోరింగ అభయారణ్యంలో ఉన్నట్టు గుర్తించారు. ఎప్పటికపుడు గణాంకాలు తెలుసుకుంటూ జీవ వైవిధ్యాన్ని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం గణాంక నివేదికలను డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్‌లో పర్యవేక్షిస్తూ జీవ వైవిధ్యానికి సంబంధించి తీసుకోవాలని జాగ్రత్తలను నిర్దేశిస్తారు. కనీసం రెండు దశాబ్దాల నివేదికలు డెహ్రాడూన్‌లో సిద్ధంగా వున్నాయి. వీటిని అధ్యయనం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా జీవ వైవిధ్యానికి సంబంధించి కోరంగి అభయారణ్యంలో చర్యలు చేపడుతుంటారు.రాజమహేంద్రవరం ఫారెస్టు సర్కిల్ అధ్వర్యంలో ఎగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20, 21 తేదీల్లో చిత్తడి నేలల పక్షి జాతుల గణన నిర్వహించడం జరిగిందని అటవీ శాఖ సిసిఎఫ్, ఎగ్రి ఫౌండేషన్ సిఇఓ జెఎస్‌ఎన్ మూర్తి చెప్పారు. లెక్కింపు వాలంటీర్లకు ముందుగా శిక్షణ నిర్వహించి రెండు రోజుల పాటు గణన నిర్వహించినట్టు తెలిపారు. వాలంటీర్లు బృందాలుగా బోట్లపై ప్రయాణిస్తూ బోటు వేగం, ఎగిరే పక్షి వేగాన్ని శాస్ర్తియ ప్రమాణాలను అనుసరించి నిర్దేశిత ఫార్మెట్‌ను నింపుతూ పక్షిజాతులను లెక్కించారు. ఒక్కో బోటుపై 18 మంది చొప్పున ప్రయాణిస్తూ ఆ సమయంలో ఏ ఏ పక్షులు ఎన్ని ఎగురుతూ కన్పించాయనే విధంగా లెక్కిస్తారు.ఏదేమైనప్పటికీ గతం కంటే పక్షుల సంఖ్య తగ్గిందని ఈ నివేదికను బట్టి తేటతెల్లమైంది. అవసరమైన సంరక్షణా చర్యలు చేపట్టాల్సి వుందని, జీవ వైవిధ్యానికి సంబంధించి శాస్ర్తియబద్ధంగా చర్యలు చేపట్టాల్సిందిగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆసియాలోనే కోరంగి అభయారణ్యం రెండో అతి పెద్దది. ఈ అడవిలో పక్షుల సంఖ్య తగ్గుముఖం పట్టింది కాబట్టి అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వుందని నిపుణులు అంటున్నారు.