తిరుపతి, మార్చి 14, (way2newstv.com)
చిత్తూరు జిల్లాలో డార్క్ ఏరియాలపై ఆంక్షలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనేక ప్రాంతాల్లో వ్యవసాయానికి బోరు బావులు తవ్వడంపై నిషేధించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 42 మండలాల్లో 421 గ్రామాల్లో భూగర్భ జలాల వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. గతంలో జిల్లాలో డార్క్ ఏరియాలపై ఉన్న ఆంక్షలు ఎత్తేయాలని అనేక ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేశారు. తిరిగి ప్రభుత్వం ఈ ఆంక్షలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ గ్రామాల పరిధిలో బోరుబావులు తవ్వరాదని స్పష్టం చేసింది. ఈ గ్రామాల పరిధిలోని రైతులు పంట సాగు చేసు కొనేందుకు కొత్తగా బావులు , బోర్లు తవ్వడానికి వీలు లేదు. జిల్లాలో గత వర్షాకాలంలో కురిసిన వర్షాలు జిల్లా యంత్రాగం చేపట్టిన వివిధ నీటి సంరక్షణ పనులు వల్ల 26 మీటర్లు లోతు ఉన్న భూగర్భ జలమట్టం నేడు 10 మీటర్ల పైకి వచ్చింది. 16 మీటర్లు నీటి మట్టం పెరింది. దాదాపు 130 టీఎంసీల భూగర్భనీరు ఆదా అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆంక్షలు కొనసాగడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
డార్క్ ఏరియాలపై మరిన్ని ఆంక్షలు
జిల్లాలో గతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో చిత్తూరు, మదనపల్లి డివిజన్ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయి నీటిఎద్దడి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయిన ప్రాంతాలను గుర్తించి వాటిని డార్క్ ఏరియా ప్రాంతాలుగా గుర్తించింది. తదనుగుణంగా ఆ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు మినహా ఇతర అవసరాలకు బావులు, బోర్ల తవ్వకాన్ని నిషేధించింది. తాజాగా జిల్లాలో 42 మండలాల్లోని 421 గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని భూగర్భ జలవనరులు శాఖ కేంద్రానికి నివేదించింది. దీన్ని ఆధారంగా కేంద్రం ఆదేశాలతో ప్రభుత్వం జిల్లాలో 42 మండలాల్లో 421 గ్రామాలను డార్క్ ఏరియా ప్రాంతాలుగా గుర్తించి బోర్లు బావులు తవ్వకాలపై ఆంక్షలను పొడిగించింది. ప్రస్తుతం ఈ ఆంక్షలు కొనసాగుతున్న అనేక గ్రామాల్లో నీటిమట్టం పెరిగినా కొత్తగా బావులు బోర్లు తవ్వకానికి ఈ ఆంక్షలు అడ్డురావడంతో నీరు ఉన్న పంటలను సాగు చేసుకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. గతంలో ఈ ఆంక్షలు ఉన్న అనేక గ్రామాల్లో వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో బావులు, బోర్లు ఎండిపోవడంతో కరెంట్ చార్జీలు భారమని భావించిన రైతులు ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రద్దు చేసుకొన్నారు. ప్రస్తుతం రెండు సంవత్సరాలుగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాల పెరిగి వ్యవసాయ బావులు బోర్లలో నీరు ఉన్నా ఈ ఆంక్షల కారణంగా రద్దు చేసుకొన్న విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక మంది రైతుల బావులు బోర్లలో సంవృద్ధిగా నీరు ఉన్నా పంటలను సాగు చేసుకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. గతంలో తమ ఆందోళనలతో ఈ ఆంక్షలను సడలిస్తారని రైతులు భావించినా తిరిగి ప్రభుత్వం పొడిగించడాన్ని రైతులు సహించలేక పోతున్నారు. మరో పక్క సంవత్సరాలుగా ఈ ఆంక్షలు కొనసాగుతుండటంతో డార్క్ ఏరియా ప్రాంత రైతులు వ్యవసాయానికి స్వస్తి చెప్పాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో కుప్పం మండల పరిధిలో 30 గ్రామాలు, శాంతిపురంలో 26, గుడిపల్లిలో 25, రామకుప్పంలో 23, ఎస్‌ఆర్ పురంలో 24, తవణంపల్లిలో 16, పూతలపట్టులో 15, రామసముద్రంలో 15, వి కోట, పెనుమూరు, పెద్దపంజాణిలో 14 చొప్పున, రామచంద్రాపురంలో 13, వడమాలపేటలో 12, పలమనేరులో 11, పాలసముద్రంలో 11, జీడి నెల్లూరులో 10, పలిచెర్లలో 10, తిరుపతి రూరల్‌లో 10, పాకాలలో 9, మదనపల్లిలో 9, పుంగనూరులో 9, ఐరాలలో8, వెదురుకుప్పం, యాదమరి, పీలేరు, రేణిగంట మండలాల పరధిలో ఏడు గ్రామాలు చొప్పున, బైరెడ్డిపల్లిలో ఆరు, ఎర్రావారిపాళ్యం, చిన్నగొట్టిగల్లు, గంగవంరం, కార్వేటినగరం మండలాల్లో ఐదు గ్రామాలు చొప్పున, పీటియం, బికొత్తకోట, కెవిపల్లి, సదుం మండలాల్లో నాలుగు గ్రామాలు, బంగారుపాళ్యం, చౌడేపల్లి, మొలకల చెరువు, కలికిరిలో మూడు గ్రామాల చొప్పున, చంద్రగిరి, శ్రీకాళహస్తిమండలాల్లో ఒక్కోటి వంతున ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో కొత్తగా బావులు, బోర్ల తవ్వడానికి ప్రభుత్వం అనుమతించదు. ఉన్న ఆంక్షలు సడలిస్తారని ఆశించిన రైతులకు ఇందుకు భిన్నంగా ప్రభుత్వం ఆంక్షలు పొడిగించడంపై ఈ ప్రాంత రైతుల్లో ఆందోళన నెలకొంది. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి వాస్తవాలను గుర్తించి ఈ ఆంక్షలపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని డార్క్ ఏరియా ప్రాంత రైతులు కోరుతున్నారు.