విశాఖ టీడీపీలో గందరగోళం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విశాఖ టీడీపీలో గందరగోళం

విశాఖపట్టణం, మార్చి 14, (way2newstv.com)
విశాఖ జిల్లా టిడిపిలో సీట్ల పంపిణీపై గందరగోళం నెలకొంది. ఎవరికి ఎక్కడ టిక్కెట్‌ ఇవ్వాలో అధినేత చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు. మంత్రులు లోకేష్‌, గంటా శ్రీనివాసరావు పోటీ చేసే స్థానాలపై రోజుకో మాట వినిపించింది. లోకేష్‌ భీమిలిలో పోటీ చేస్తారంటూ వారం రోజులు, తర్వాత విశాఖ ఉత్తరలోనూ ఖాయమంటూ చర్చ నడిచింది. చివరకు లోకేష్‌ మంగళగిరి నుంచి పోటీ చేస్తారంటూ అధినేత చంద్రబాబు  ప్రకటించే జాబితాలో లోకేష్‌ పేరుంటుందని, ఉండవల్లిలోనే ఆయన ఓటు చేర్చుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. లోకేష్‌ విశాఖలో పోటీ చేస్తున్నందున బాలకృష్ణ చిన్నఅల్లుడు శ్రీభరత్‌కు విశాఖ ఎంపీ టిక్కెట్‌ ఇవ్వడం కుదరదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే శ్రీభరత్‌ బాలకృష్ణ ద్వారా తీవ్రమైన ఒత్తిడి చేయించడంతో ఆయన చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్‌ను మంగళగిరికి మార్చినట్లు చెబుతున్నారు. దీంతో యువనేత శ్రీభరత్‌కు విశాఖలో లైన్‌క్లియర్‌ అయ్యే అవకాశాలున్నాయంటూ తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. మంత్రి గంటాను భీమిలిలోనే పోటీ చేయించాలని నిర్ణయించారంటూ తెలిసింది. లోకేష్‌ భీమిలి లేదా ఉత్తరలో ఎమ్మెల్యేగా వస్తే ఎంపీగా గంటాను పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. 


విశాఖ టీడీపీలో గందరగోళం

గంటా ఎంపీగా వెళ్లేందుకు సుముఖంగా లేరన్న ప్రచారముంది. ఒక దశలో భీమిలికి జెడి వివి.లక్ష్మీనారాయణ, అశోక్‌ గజపతిరాజు కుమర్తె అదితి పేర్లు తెరపైకి వచ్చాయి. జెడి లక్ష్మీనారాయణ టిడిపిలో చేరేందుకు సుముఖంగా లేకపోవడం వల్లే తిరిగి గంటాను భీమిలికే పంపించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరోవైపు గంటాను భీమిలి, ఉత్తర, అనకాపల్లి అసెంబ్లీ స్థానాలకు పరిశీలిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఒక వేళ భీమిలిలో స్థానిక కాపులకు టిక్కెట్‌ ఇవ్వాల్సి వస్తే గంటా అనకాపల్లిలో పోటీ చేయించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అక్కడ ఎంపీగా గవర సామాజిక వర్గానికి చెందిన ఆనంద్‌కు టిక్కెట్‌ ఇచ్చే అవకాశం ఉన్నందున అనకాపల్లి ఎమ్మెల్యేగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారినే పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారన్న ప్రచారం ఉంది. పైగా అక్కడ వైసిపి నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన గుడివాడ అమర్‌కు టిక్కెట్‌ ఖాయం చేసినట్లు తెలిసింది. ఆయన ఈ నెల 22 న నామినేషన్‌ వేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో బలమైన నేత గంటాను ఎక్కడ పోటీ చేయించాలన్న అంశంలో అధినేతకు, ఇటు గంటాకు స్పష్టత లేదన్న ప్రచారం జరుగుతోంది. జివిఎంసి పరిధిలో తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమంలో గణబాబు, పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి, గాజువాకలో పల్లా శ్రీనివాసరావు, దక్షిణంలో వాసుపల్లి గణేష్‌కుమార్‌కు సీట్లు ఖాయమయ్యాయి. ఇక ఉత్తరంలో ఎవరికి టిక్కెట్‌ ఇస్తారో ఇంకా తేలాల్సి ఉంది. పంచకర్ల రమేష్‌బాబు ఉత్తరం సీటును అడుగుతున్నారు. మరోవైపు స్వాతి కృష్ణారెడ్డి, సబ్బంహరి కూడా ఆశలు పెట్టుకున్నారు. గురువారం విడుదల చేసే జాబితాతో కొంత మేర స్పష్టత వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల పట్ల దక్షిణం, గాజువాకలోనూ వ్యతిరేకత కనిపిస్తోంది.