అనంతపురం, మార్చి 22, (way2newstv.com)
అనంతపురం జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గత 10 రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో జనం వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఈ వారంలో గరిష్ఠంగా 37, కనిష్ఠంగా 27 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 11 గంటల నుంచే ఎండ తీవ్రత అధికమవుతోంది. మధ్యా హ్నం సమయానికి మాడు పగిలి పోయేలా ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇక పట్టణాల్లో అయితే సిమెంట్, తారురోడ్ల సెగతో ఉష్ణోగ్రత మరింత అధికంగా కనిపిస్తోంది. గ్రామాల్లో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లాలన్నా ఇబ్బందులు పడుతున్నారు.
మండుతున్న ఎండలు
దీనికి తోడు పల్లెల్లో విద్యుత్ కోతలు అమలు చేస్తుండడంతో ఉక్కపోత భరించలేక ఏ చెట్ల కిందనో, నీడ ఉన్న ప్రదేశాల్లోనో సేద తీరుతున్నారు. కాగా ఈ నెల 12వ తేదీ కనిష్ఠంగా 22, గరిష్ఠంగా 37 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 13వ తేదీ కనిష్ఠంగా 24, గరిష్ఠంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 27వ తేదీ నాటికి గరిష్ఠం 40, కనిష్ఠం 27 సెల్సియస్ డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. పగటి పూట కనీస ఉష్ణోగ్రతలు 25 నుంచి 27 సెల్సియస్ డిగ్రీలు నమోదవుతుండగా, రాత్రి పూట 10 గంటల వరకూ 32 సెల్సియస్ డిగ్రీలు నమోదువుతోంది. పగటి పూట గరిష్ఠంగా 37 నుంచి 39 సెల్సియస్ డిగ్రీలు ఉంటోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ వేడి కొంత తక్కువగా ఉన్నా, ఆ తర్వాత పెరుగుతోంది