ప్రచారానికి దూరంగా సీనియర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రచారానికి దూరంగా సీనియర్లు

కడప, మార్చి 23  (way2newstv.com)
నామినేషన్లు జోరందుకున్నాయి. ప్రచారం హీటెక్కుతోంది. అయినా వైసీపీలోని కొంతమంది సీనియర్లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్‌ దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న సీనియర్లకు పార్టీ అధ్యక్షుడు జగన్‌ మొండిచేయి చూపారు. కనీసం వీరి అభ్యర్థిత్వాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో వీరంతా ఎన్నికలకు దూరంగా నిలిచి ఇంటికే పరిమితమయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి ఇటీవల వైసీపీలో చేరారు. ఆమె టెక్కలి అసెంబ్లీ నుంచైనా.. శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచైనా పోటీచేస్తారని భావించారు. కానీ ఆమె పేరు వినిపించలేదు.ఇక విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీకి అవకాశం ఇస్తారని అనుకున్నా.. దీనిని జగన్‌ నిరాకరించారు. 


ప్రచారానికి దూరంగా  సీనియర్లు

ఈ సీటును ఆమెకుగానీ, తన మేనల్లుడు చిన్న శ్రీనుకుగానీ ఇవ్వాలని బొత్స సత్యనారాయణ కోరారని సమాచారం. కానీ అసెంబ్లీకే బొత్స కుటుంబాన్ని పరిమితం చేశారు. గత ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ నుంచి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పోటీ చేశారు. కానీ, ఈసారి ఆమెకు ఎక్క డా స్థానం కల్పించలేదు. ఈ ఎన్నికల్లో ఆమె ఉనికి కనిపించలేదు. మాజీ ఎంపీ, జగన్‌ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డికి ఒంగోలు లోక్‌సభ స్థానం ఇవ్వకుండా జగన్‌ హ్యాండిచ్చారు.గత ఎన్నికల్లో ఆయన చేతిలో ఓటమి చవి చూసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి గౌరవ మర్యాదలు చేసి.. వైవీకి మాత్రం పొగ పెట్టారంటూ విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇక నెల్లూరులోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మాగుంటను నెల్లూరు నుంచి బరిలోకి దింపితే.. ఒంగోలు నుంచి మేకపాటి రాజమోహనరెడ్డికి అవకాశం ఇస్తారని వైసీపీ వర్గాలు భావించాయి. కానీ నెల్లూరు రూరల్‌కు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్‌ పొందిన ఆదాల ప్రభాకరరెడ్డిని పిలిపించుకుని మరీ నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ను ఇచ్చారు. ఇక జగన్ బాబాయి, వైవీ సుబ్బారెడ్డి అయితే అడ్రస్ లేరు. ఇక్కడ ఉండ లేక విదేశాలకు కూడా వెళ్లి వచ్చారు.