గ్రామాల్లో పోటెత్తున్న కల్తీ మద్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రామాల్లో పోటెత్తున్న కల్తీ మద్యం

కర్నూలు, మార్చి 8, (way2newstv.com)
కాదేది కల్తీకి అనర్హమనేది నేటి సామెతగా మారింది. కల్లు, సారా, చీఫ్‌ లిక్కర్‌ నుంచి ఖరీదైన మద్యం వరకు కల్తీ చేస్తున్నారు. నెలరోజుల క్రితం కర్నూలు నగర శివారులోని వీకర్‌సెక్షన్‌ కాలనీ సమీపంలో ఓ ఇంట్లో బ్రాండెడ్‌ మద్యం ఖాళీ సీసాల్లో కల్తీ మద్యాన్ని తయారు చేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బాటిల్‌ రూ.వెయ్యికి పైగా ఉండే బ్రాండ్లన్నింటినీ అతను రెక్టిఫైడ్‌ స్పిరిట్‌తో తయారు చేస్తూ పట్టుబడటంతో ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది క్రితం గోనెగండ్ల మండలం పుట్టపాశం గ్రామంలో రంగన్న అనే వ్యక్తి కల్తీ మద్యం తయారు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇతడు బయటి ప్రాంతం నుంచి సీసాలు, మూతలు తీసుకొచ్చి కల్తీమద్యం తయారు చేసి, బెల్ట్‌షాపులకు విక్రయిస్తున్నాడు. 


 గ్రామాల్లో పోటెత్తున్న కల్తీ మద్యం

కోసిగి ప్రాంతంలోనూ ఆరు నెలల క్రితం పోలీసులు కల్తీ మద్యాన్ని విక్రయిస్తుండగా ఓ వ్యక్తిని పట్టుకున్నారు.  ఆళ్లగడ్డలో ఓ వ్యక్తి మద్యంలో నీళ్లు కల్తీ చేసి విక్రయిస్తుండగా ఐదు నెలల క్రితం పోలీసులు అరెస్టు చేశారు.ఇవే కాదు వెలుగులోకి రాని ఉదంతాలు చాలానే ఉన్నాయి. కల్తీ మద్యానికి అవసరమైన రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ను వ్యాపారులు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, రాయచూరు జిల్లాల నుంచి అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. 2015 లోనూ రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం అమ్మకాలు వెలుగుచూసిన విషయం సంచలనం సృష్టించింది. అప్పట్లో ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల వ్యాపారులు ఉన్నట్లు  ఆరోపణలొచ్చాయి.మద్యానికి పెద్దలే కాదు యువత కూడా బానిస అవుతోంది. టీనేజీ వయస్సు నుంచే దీనికి అలవాటుపడుతున్నారు. స్నేహితులతో సరదాగా మొదలయ్యే ఈ అలవాటు వారిని బానిసను చేస్తోంది. రోజూ రాత్రి ఇంటికి వస్తున్నారంటే వణికిపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మద్యం తాగిన వ్యక్తి ఏ మూడ్‌లో వస్తాడో.. ఏం చేస్తాడోనన్న భయం పలు కుటుంబాల్లో ఉంది. యువత నుంచి వృద్ధుల వరకు మద్యానికి బానిసలుగా మారడంతో అటు ఆర్థికంగా మరోవైపు ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు.