మిల్లర్లదే రాజ్యం (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మిల్లర్లదే రాజ్యం (కరీంనగర్)

కరీంనగర్, మార్చి 18 (way2newstv.com): 
ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన ధాన్యాన్ని మరాడించి తిరిగి ప్రభుత్వానికే సరఫరా చేయాల్సిన ప్రక్రియలో నిర్లక్ష్యం నెలకొంది.. ఎప్పటికప్పుడు సీయంఆర్‌ రాబట్టాల్సి ఉండగా పర్యవేక్షణ లోపంతో ఇంకా సా...గుతూనే ఉంది. ఇప్పటికే పలుమార్లు జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌ మిల్లర్లతో సమావేశమై గట్టిగా మందలించినా స్పందన కరవవడం విడ్డూరం.. గడువులోగా మిల్లింగ్‌ చేసి ఇవ్వాలని స్పష్టంగా ఆదేశించినా ఫిబ్రవరి 28లోగా అందించాల్సిన బియ్యం ఇంకా గోదాములకు చేరకపోవడం శోచనీయం.. ప్రభుత్వ ఖజానాకు కాపలా ఉండాల్సిన యంత్రాంగం మీనమేషాలు లెక్కించడంతో సీయంఆర్‌ అక్రమ వ్యాపారానికి కల్పతరువుగా మారే ప్రమాదం ఉంది.
జిల్లాలో 157 రైస్‌ మిల్లులు ఉండగా 373568.434 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సరఫరా చేసింది. సదరు ధాన్యాన్ని మరాడించి 68 శాతం బియ్యంగా ఇవ్వాల్సి ఉంటుంది. గత నెల 28లోగా వందశాతం సీయంఆర్‌ ఇవ్వాలన్నది ప్రభుత్వ నిబంధన. ఇప్పటికే రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌ ఆకున్‌ సబర్వాల్‌ స్పష్టంగా నిర్దేశించారు. గడువులో ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి ఇవ్వాలని, నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు జేసీ మిల్లర్లతో పలుమార్లు సమావేశం నిర్వహించి సీయంఆర్‌ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అయినా 50 శాతం కూడా సీయంఆర్‌ ఇవ్వని మిల్లులు ఉండటం దారుణ పరిణామం. గడువులోగా కనీసం ప్రతి మిల్లు 90 శాతమైనా ఇవ్వాలి... ప్రతికూల పరిస్థితుల క్రమంలో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో 36 శాతమే సీయంఆర్‌ ఇచ్చిన మిల్లులు ఉండటం గమనార్హం.



మిల్లర్లదే రాజ్యం (కరీంనగర్)

వందశాతం ఇచ్చిన మిల్లులు 11 మాత్రమే ఉండగా 80-95 శాతం సీయంఆర్‌ ఇచ్చిన మిల్లులు 50వరకు ఉన్నాయని అధికారిక గణాంకాలు చాటుతున్నాయి. అయితే రైస్‌మిల్లు సామర్థ్యాన్ని బట్టి ధాన్యాన్ని కేటాయించాలి. నిబంధనల ప్రకారం 2 టన్నుల సామర్థ్యమున్న మిల్లుకు వెయ్యి మెట్రిక్‌ టన్నులు, 4 టన్నులకు 2 వేల మెట్రిక్‌ టన్నులు, 6 టన్నుల సామర్థ్యమున్న మిల్లుకు 3 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించాలనేది ఖరీఫ్‌ పంట దిగుబడి నిబంధన.. ఇంతకుమించి కేటాయించాలనుకుంటే సీఎంఆర్‌ను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అప్పగిస్తే అదనంగా ఇచ్చే వీలుంటుంది. కానీ గతంలోనూ నిర్లక్ష్యం చేసిన మిల్లులకు నిబంధనలకు మించి ధాన్యం కేటాయించారని తెలుస్తోంది.
మరాడించిన బియ్యాన్ని భద్రపరిచేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. ముందస్తు ఆలోచన లేమి ప్రస్తుత పరిస్థితికి కారణం కాగా సీయంఆర్‌ ఇచ్చే మిల్లులు వేచిచూడాల్సిన పరిస్థితి. జిల్లాలో ప్రైవేట్‌ మిల్లులను అద్దెకు తీసుకున్నా సరిపోకపోవడంతో ఇతర జిల్లాల వైపు దృష్టిసారిస్తున్నారు. తిమ్మాపూర్‌, నగునూరు, రుక్మాపూర్‌ ప్రైవేట్‌ గోదాములు, సీడబ్ల్యూసీ, మార్క్‌ఫెడ్‌, బొమ్మకల్‌ సీడబ్ల్యూసీ, హుజూరాబాద్‌ ఎస్‌డబ్ల్యూసీ, ఎఫ్‌సీఐ జమ్మికుంట గోదాముల్లో 166533 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని నిల్వ చేశారు. ఒక్కో మిల్లుకు 300 లారీల వరకు సరఫరా చేయగా మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల జిల్లాల నుంచి ఇక్కడే మిల్లింగ్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో గోదాములు సరిపోకపోవడంతో బియ్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో సమాలోచనలు చేస్తున్నారు. ఇతర జిల్లాల్లోని గోదాములను అద్దెకు తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. మరో 85,003 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రానుండటంతో గోదాములను సిద్ధం చేయనున్నారు.
ధాన్యం ఉత్పత్తిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా తర్వాత అత్యధికంగా 500లకు పైగా రైస్‌మిల్లులు ఉన్నాయి. ఐకేపీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీయంఆర్‌ కింద మిల్లులకు పౌరసరఫరాల శాఖ కేటాయిస్తోంది. బాయిల్డ్‌ రైస్‌ అయితే క్వింటాకు 67 కిలోలు, రారైస్‌కు 68 కిలోలు మిల్లరు ఇవ్వాల్సి ఉంటుంది. ధాన్యాన్ని బియ్యంగా మార్చి మిల్లర్లు తిరిగి పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. ఒక్కో క్వింటా ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు రూ.35ను పౌరసరఫరాల శాఖ చెల్లిస్తోంది. ఏటా ఈ ప్రక్రియ ఉంటుంది. ఖరీఫ్‌, యాసంగి ధాన్యమైనా పలువురు మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారని సమాచారం. ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని మరాడించి ఇతర మార్గాల ద్వారా పక్కదారి పట్టిస్తున్నారు. ఉన్నతాధికారులు ఒత్తిడికి గురిచేస్తే తప్ప సకాలంలో ఇచ్చిన దాఖలాలు తక్కువ.. నెలల తరబడి వ్యాపారం చేసుకొని వాటి వడ్డీని బియ్యం రూపంలో సరఫరా చేస్తున్నారు. తీవ్రమైన నష్టాలతో ఉండి మూతపడేలా ఉన్న మిల్లుల విషయం తెలిసీ ధాన్యం కేటాయించడంతో బియ్యం దక్కడం లేదు.