హైద్రాబాద్, మార్చి 27, (way2newstv.com)
ఆ ఊరిలో ఓట్లు అడిగేందుకు వెళ్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ‘‘మా గ్రామాన్ని అభివృద్ధిచేయని మీకు ఓట్లు ఎందుకేయాలి?’’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఊరి మొత్తం పోస్టర్లు అతికించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది మరెక్కడో కాదు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోని శ్రీకాళహస్తిలో. ఈ నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం గుర్రప్పనాయుడు కండ్రిగ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌లో తాము పాల్గోబోమని, అభ్యర్థులెవరూ తమని ఓట్లు అడగొద్దంటూ పోస్టర్లు అతికించారు.
‘‘మా గ్రామంలో నీళ్లు లేవు. సరైన రోడ్లు లేవు. వంతెనలు లేవు. కరెంటు సరిగ్గా రాదు. ఏ పార్టీ మాకు న్యాయం చేయలేదు. ఈ ఎన్నికల్లో ఎవరికీ మేం ఓట్లు వేయబోం’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో అడుగుపెట్టాలంటేనే అభ్యర్థులు హడలిపోతున్నారు. ప్రజలు తమను నిలదీస్తారనే ఆందోళన వారిలో నెలకొంది. గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం ఈ స్థానంలో ఆయన కుమారుడు బొజ్జల సుధీర్‌రెడ్డి టీడీపీ నుంచి బరిలో దిగుతున్నారు. వైసీపీ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి, జనసేన నుంచి వినుత నగరం పోటీ చేస్తున్నారు. గ్రామస్థుల నిరసన గురించి తెలుసుకున్న అభ్యర్థులు తప్పని పరిస్థితుల్లో వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి, ఈసారైనా ఆ గ్రామం దశ మారుతుందో లేదో చూడాలి