తేదేపా గెలుపును ఎవరూ ఆపలేరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తేదేపా గెలుపును ఎవరూ ఆపలేరు

అమరావతి, మార్చి 11, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ 30 రోజుల సమగ్ర ప్రణాళికతో ఎన్నికలకు కదం తొక్కాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలతో సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఎన్నికలకు అన్ని విధాలా సమాయత్తంగా ఉన్నామని తెలిపారు. ఎంత సన్నద్ధంగా ఉన్నా అవతలి పార్టీ నేర చరిత్ర కలిగిన పార్టీ అని గుర్తించి మరింత అప్రమత్తంగా ఉండాలని క్యాడర్ కు  సూచించారు. ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అనే తెదేపా నినాదం రాష్ట్రమంతా మార్మోగాలని పిలుపునిచ్చారు. ‘మిమ్మల్ని జైలుకు పంపే భరోసా నాదీ’ అనే నినాదంతో జగన్ ఉన్నారని చంద్రబాబు ఎద్దేవాచేశారు. ఇప్పటికే చాలా మందిని జైలుకు పంపి చూపారని గుర్తు చేశారు. దీని బట్టే ప్రజలు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకుంటారని తెలిపారు.


తేదేపా గెలుపును ఎవరూ ఆపలేరు

ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకాల్సిన అవసరం లేదని, కేసీఆర్ కు,  మనకు అదే తేడా అదేనని చంద్రబాబు అన్నారు. దుర్మార్గంగా మాట్లాడితే నోరు మూయించే సత్తా తమకు ఉందని, చేతకాని వాళ్లం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అభివృద్ధి చేసిన హైదరాబాద్ ను దొంగతనంగా అనుభవిస్తూ కుట్రలు పన్నే స్థాయికి వచ్చారని కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నేటి నుంచి నెలరోజుల పాటి ప్రతి ఒక్కరిలోనూ అప్రమత్తత అవసరమని, ఎన్నికల యుద్ధానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. ప్రస్తుత సంక్షేమ పథకాలు కూడా ఆపివేయించి ప్రజలకు ద్రోహం చేసే కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. దీన్ని సమర్థంగా ఎండగట్టాలని సూచించారు. మేలో జరగాల్సిన ఎన్నికలను నెల రోజులు ముందుకు తీసుకురావడాన్ని సంక్షోభంగా భావించరాదని, దీన్నే అవకాశంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు.