ఒంగోలు, మార్చి 22, (way2newstv.com)
ఎండలు మండుతున్నాయి. వాటితో పాటు వంట నూనెల ధరలు పోటీ పడుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు బడుగు జీవులకు మింగుడు పడటం లేదు. కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతిపై సుంకం పెంచడమే వంట నూనెల ధరలు పెరగడానికి కారణమైందని వ్యాపారులు చెబుతున్నారు. హోటళ్లు, చిరుతిళ్ల తయారీ, బండ్లపై బజ్జీలు తదితరాల తయారీకి వంటనూనెలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు నిత్యం వంట తయారీలో నూనె ఉండాల్సిందే. పెరిగిన ధరలతో అన్నివర్గాల మీద భారం పడుతోంది.5 లీటర్ల వంట నూనె క్యాను పక్షం రోజుల కిందట రూ.410కి విక్రయించేవారు.
మరింత పెరిగిన ఆయిల్ ధరలు
ప్రస్తుతం రూ.470 పలుకుతోంది. లీటర్లు, కిలోల లెక్కన ప్యాకెట్లలో కొనుగోలు చేస్తున్న వినియోగదారులకు లీటరుకు రూ.10 నుంచి రూ.15 దాకా పెంచడంతో పేదలు కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. వేరుసెనగ, పొద్దుతిరుగుడు పంటల ఉత్పత్తులు తగ్గిపోవడంతో ధరల మీద ప్రభావం చూపుతోందని వ్యాపారులు చెబుతున్నారు. రబీ సీజనులో చేతికి వచ్చిన వేరుసెనగ కాయలను తక్కువ ధరతో వ్యాపారులు కోనుగోలు చేస్తున్నారు. మరోవైపు వేరుసెనగ నూనె ధరలు మాత్రం దిగి రావడం లేదు. మిల్లుల వ్యాపారులు కుమ్మక్కై నూనె ధరలు అమాంతం పెంచుతున్నారని పేదలు వాపోతున్నారు. క్వింటా వేరుసెనగ రూ.3,400 కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన నూనె విక్రయాలు దిగిరావాల్సి ఉందని, అందుకు భిన్నంగా పెరగడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులు మాత్రం పన్నుల భారంతోనే పెరుగుతున్నట్లు చెబుతున్నారు