నీరవ్ మోడీ అరెస్ట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నీరవ్ మోడీ అరెస్ట్

లండన్, మార్చి 20 (way2newstv.com)
భారత్‌లో బ్యాంకులకు కోట్లాది రూపాయలు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి గట్టి షాక్ తగిలింది. లండన్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. సాయంత్రం 3.30 గంటలకు కోర్టులో హాజరుపరిచారు. కాగా ఇటీవలే లండన్ కోర్టు అతడికి అరెస్టు వారెంటు జారీ చేసిన విషయం తెలిసిందే. నీరవ్ మోదీ, అతడి మేనమామ మోహుల్ చోక్సీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి సుమారు రూ.14 వేల కోట్ల రుణాలు ఎగనామం పెట్టారు. విదేశాలకు పారిపోయిన నీరవ్‌ను భారత్‌ తీసుకొచ్చేందుకు సీబీఐ, ఈడీ ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. 


నీరవ్ మోడీ అరెస్ట్

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. నీరవ్ మోదీ మోసానికి సంబంధించిన కేసు దర్యాప్తు చేస్తున్నాయి. నీరవ్ మోదీపై చట్టపరమైన చర్యలు తీసుకొని తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతూ మార్చి 9న లండన్‌లోని హోంశాఖ కార్యాలయానికి ఈడీ లేఖ రాసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న లండన్‌ కోర్టు అతడికి అరెస్టు వారెంటు జారీ చేసింది.. నీరవ్‌ మోదీ ప్రస్తుతం మారువేషంలో లండన్‌లో వజ్రాల వ్యాపారం చేస్తున్నాడంటూ ఇటీవల అక్కడ ఓ పత్రిక ప్రచురించిన కథనం.. సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఓ ఖరీదైన కోటును ధరించిన నీరవ్‌.. అక్కడ ఓ పాత్రికేయుడికి తారసపడటంతో అతడు లండన్‌లో ఉన్నట్టు తెలిసింది. దీంతో అతణ్ని భారత్ రప్పించడానికి ఇక్కడి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.