నత్తకే నడకలు (గుంటూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నత్తకే నడకలు (గుంటూరు)

గుంటూరు, మార్చి 9 (way2newstv.com): 
రాజధాని అమరావతికి రాయలసీమను అనుసంధానం చేసే ప్రధాన రైలు మార్గం గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఏడాది క్రితం మంజూరైన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం కాగా గుంటూరు, గుంతకల్లు డివిజన్ల పరిధిలో సుమారు 401.47 కి.మీ. మార్గాన్ని ఆరు భాగాలుగా విభజించుకొని అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. కొద్ది శాతం మినహా అవసరమైన భూసేకరణ పూర్తి చేశారు. అయితే పనులు నత్తనడకన నడుస్తుండడంతో గడువు నాటికి పూర్తవుతాయా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.గుంటూరు-గుంతకల్లు రైలు మార్గంలో డబ్లింగ్‌ ఆవశ్యకతను గుర్తించిన రైల్వేశాఖ 2017 జనవరిలో విద్యుద్దీకరణతో కలిపి రూ.3,631 కోట్లు మంజూరు చేసింది. రాయలసీమ జిల్లాల నుంచి నేరుగా అమరావతికి చేరుకోవడానికి ఇదే సరైన మార్గం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు సాధించింది. తద్వారా నవ్యాంధ్ర రాజధానికి పనుల నిమిత్తం వచ్చే వారి సంఖ్య రెట్టింపు అవుతుందని, అందుకు తగ్గట్లు రైళ్ల సంఖ్య పెంచాలంటే రెండో మార్గంతోపాటు విద్యుద్దీకరణ అత్యవసరంగా భావించారు. 


నత్తకే నడకలు (గుంటూరు)

అంతేకాకుండా రాయలసీమలో సున్నపురాయి, నాపరాయి, సిమెంటు, రంగురాళ్ల పరిశ్రమలు అధికంగా ఉన్నందున కృష్ణపట్నం, కాకినాడ ఓడరేవులకు గూడ్స్‌ రైళ్లల్లో వాటి ఉత్పత్తులను తరలించడానికి సులువుగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. నంద్యాల- ఎర్రగుంట్ల మార్గం పూర్తి చేసి ఈ లైన్‌కు అనుసంధానం చేయడంతో కడప, కర్నూలు జిల్లాల నుంచి రాజధానికి చేరుకోవడానికి చేరువుగా ఉంది. గతంలో కడప నుంచి విజయవాడ రావాలంటే తిరుపతి మీదుగా తిరిగి వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలిగాయి.
నల్లపాడు-సాతులూరు, డోన్‌-పెండేకల్లు మధ్య మొదటి దశలో చేపట్టిన పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని నిర్ణయించినప్పటికీ అధికారులు ధీమాగా చెప్పలేకపోతున్నారు. సాతులూరు-దిగువమెట్ట, నంద్యాల-డోన్‌, పెండేకల్లు-గుంతకల్లు చోట్ల మట్టి పనులు చేస్తున్నారు. వచ్చే 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్గంలో దిగువమెట్ట- నంద్యాల మధ్య నల్లమల అభయారణ్యం ఉండడం, బొగద, చలమ వద్ద సొరంగాలను విస్తృతపరచాల్సివుండడంతో కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు తప్పనిసరి అయ్యాయి. దాంతో ఇక్కడ పనుల పూర్తికి 2022 వరకు గడువు ఇచ్చారు. ఈ మార్గం మొత్తం కలిపి భారీ, మధ్యతరహా వంతెనలు, ఆర్వోబీలు, సబ్‌వేలు సుమారు 700 నిర్మించాల్సివుండగా వీటిలో కొన్ని పూర్తయ్యాయి.