విజయవాడ, మార్చి 26, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కొత్త తరహా పాలిటిక్స్ తెరమీదకు వస్తున్నాయి. ఎన్నికల వేళ ఒక గుర్తు పోలి ఉండే మరొక గుర్తును స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి పోటీ చేయించడం మామూలే. తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. టీఆర్ఎస్ గుర్తు కారు కావడంతో అదే పోలికతో ఉన్న ట్రక్కు, ఆటోలతో స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగారు. దీని ప్రభావం ఎన్నికల ఫలితాల్లో కొంత మేర కన్పించింది. దీంతో ఈ ఫలితాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి తెలంగాణలో ట్రక్కు గుర్తు ఈవీఎంలలో లేకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ జాగ్రత్త పడింది. ఆంధ్రప్రదేశ్ లోనూ వైసీపీకి ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కేఏ పాల్ ప్రజాశాంతిపార్టీ తరుపున తన అభ్యర్థులను నిలబెట్టారు.ప్రజాశాంతి పార్టీ గుర్తుగా హెలికాప్టర్ ను ఎన్నికల కమిషన్ కేటాయించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఫ్యాన్ గుర్తు, హెలికాప్టర్ ఒకేలా ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురవుతారని వైసీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించాల్సి ఉంది. అయితే తాజాగా నామినేషన్ల పర్వం పూర్తికావడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకేపేరున్న అభ్యర్థుల చేత ప్రజాశాంతి పార్టీ నామినేషన్లు వేయించడం చర్చనీయాంశంగా మారింది.
హెలికాఫ్టర్ సింబల్ తో జగన్ కు ఇబ్బందే
ఒకచోట కాదు రెండుచోట్ల కాదు దాదాపు పదిహేను అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లతో పోలిక ఉన్న వారిని బరిలోకి దింపింది పాల్ పార్టీ.ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ వేశారు. అదే నియోజకవర్గంలో ఒంగోలు ప్రాంతంలోని పెళ్లూరుకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు చేత పాల్ గారు నామినేషన్ వేయించారు. ఇది ఖచ్చితంగా ఓటర్లను గందరగోళానికి గురిచేయడమేనన్నది వైసీపీ ఆరోపణ. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాష్ట్ర స్థాయి నేత కావడంతో ఆయనకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. కానీ మిగిలిన జిల్లాల్లో కూడా ఇదే రీతిలో పాల్ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాయదుర్గం నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డి వైసీపీ తరుపున బరిలో ఉండగా అక్కడ ఉండాల రామచంద్రారెడ్డిని ప్రజాశాంతి పార్టీ పోటీ చేయించింది. అలాగే వైసీపీ అభ్యర్థిగా ఉరవకొండలో విశ్వేశ్వర్ రెడ్డి ఉంటే ప్రజాశాంతి పార్టీ విశ్వనాధరెడ్డిని, కల్యాణదుర్గంలో వైసీపీ అభ్యర్థి ఉషశ్రీచరణ్ ఉండగా, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ఉషారాణిని పోటీకి దింపారు. ధర్మవరంలోనూ అదే పరిస్థితి. అక్కడ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉండగా, ప్రజాశాంతి పార్టీ తరుపున పెద్దిరెడ్డిగారి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు. నామినేషన్ల పరిశీలన జరుగుతుండటంతో ఇంకా అనేక నియోజకవర్గాల్లో ఇదే విధంగా ప్రజాశాంతి పార్టీ పేర్లతో పోలికలున్నవారిని వైసీపీకి వ్యతిరేకంగా దింపిందని చెబుతున్నారు. టీడీపీ అధితనే నారా చంద్రబాబునాయుడు ప్రోద్బలంతోనే కేఏపాల్ తమ అభ్యర్థులను బరిలోకి దించారని వైసీపీ ఆరోపిస్తోంది. పేరు, గుర్తు ఒకేలా ఉంటే వైసీపీకి ఇబ్బందులు తప్పవు. దీన్నుంచి జగన్ పార్టీ ఎలా బయటపడుతుందో చూడాలి.