వేసవిలో చేపల పెంపకం లో తీసుకోవలసిన జాగ్రత్తలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వేసవిలో చేపల పెంపకం లో తీసుకోవలసిన జాగ్రత్తలు

హైదరాబాద్ మార్చ్ 9 (way2newstv.com
వాతావరణ పరిస్థితులలో అనూహ్యమైన మార్పుల వలన వేసవి ప్రారంభమునకు ముందుగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న విషయం గమనిస్తున్నాము. ఇట్టి పరిస్థితులు చేపల పెంపకమును తీవ్రముగా ప్రభావితము చేయును. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రములో ఎక్కువగా సహజసిద్దమైన జలాశయములు, చెరువులు, కుంటలలో చేపల పెంపకము సాగుచున్నది. అట్టి వనరులలో వివిధ కారణములు వలన నీటి మట్టము క్రమేపి తగ్గడం జరుగుతుంది. కానీ వేసవి ముగిసే వరకు నీరు క్రొత్తగా చేరే అవకాశం ఉండదు. ఇటువంటి పరిస్థితులలో నీటి వనరులలో వున్న చేపలను నిశితంగా    గమనిస్తూ,తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే, ఆకస్మికముగా చేపలు చనిపోయే ప్రమాదములను నివారించి, ఆర్ధిక నష్టము కలుగకుండా చేసుకొనవచ్చును.
అధిక సాంద్రత మరియు ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గుల వలన , రోగకారక సూక్ష్మక్రిముల బారిన పడి చేపలు ఆకస్మికముగా చనిపోయే ప్రమాదం జరుగుతుంది. మత్స్యకారులు/రైతులు ఈ క్రింద సూచించిన యాజమాన్య పద్ధతులు ముందస్తుగా అవలంబించినట్లైతే చేపలు చనిపోయే పరిస్థితుల బారినుండి  తప్పించి ఎటువంటి నష్టం కలుగకుండా నివారించుకోవచ్చును 


వేసవిలో చేపల పెంపకం లో తీసుకోవలసిన జాగ్రత్తలు

చెరువులోని నీటి నాణ్యత, లోతు, విస్తీర్ణం మరియు చేపల కదలికలు ప్రతి రోజు గమనిస్తూ ఉండాలి. చెరువులోని కొన్ని చేపలను మచ్చుకు పట్టి వాటి పెరుగుదల, రంగు, తోక మరియు రెక్కల స్వభావము, మొప్పెల రంగు, ఫై జిగురును, మొ|| లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. తేడాలు గమనించిన ఎడల, సంబందిత మత్స్య శాఖా అధికారి సలహాలు మరియు సూచనలు తీసుకొని నివారణ మరియు నియంత్రణ చర్యలు సత్వరమే చేపట్టిన ఎడల ఆర్థిక నష్టాన్ని కొంత మేర తగ్గించుకోవచ్చు.
ఉదయపు సమయములో చేపలు చెరువు ఫై భాగాన నోరు తెరచుకొని తిరుగుతూ ఉంటే ప్రాణవాయువు కొరత ఉందని గమనించాలి. అలాంటి సందర్భాలలో చెరువులో నీరు పెట్టటం,    అది సాధ్యం కాని పక్షంలో పెద్దగా పెరిగిన చేపలను పట్టి అమ్మి వేసుకోవాలి. దీనివలన చేపల సాంద్రత తగ్గడం వలన ప్రాణవాయువు కొరతను అధిగమించవచ్చు. కాని మత్స్యకారులు చేపలు మార్కెట్ సైజు రాలేదనో లేదా మార్కెట్లో రేట్లు తక్కువున్నయనో, ఐస్ దొరకకపోవటం, మొ కారణాల వలన నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీని వలన చేపలు ఒత్తిడికి గురి అయి చనిపోయే ప్రమాదం ఏర్పడును. చెరువులోని నీటి నాణ్యత తగ్గిపోయినప్పుడు సున్నాన్ని ఒక హెక్టారుకు 100 నుండి 250 కేజీల వరకు చెరువులో చల్లిన ఎడల, నీటి నాణ్యత పెరగడమే కాకుండా ప్రాణవాయువు శాతం పెరుగి ఉదజని సూచికను అదుపులో ఉంచును. 
చెరువులోని కలుపు మొక్కలను ఎప్పటి కప్పుడు తగ్గిస్తూ ఉండాలి లేని ఎడల రాత్రి సమయాలలో అవి కేవలం కార్బన్ డయాక్సైడ్ విడుదల చెయడం వలన నీటిలో ప్రాణవాయువు కొరత ఏర్పడి ఎక్కువ మొత్తంలో చేపలు చనిపోతు ఉంటాయి. అలాంటి సందర్భాలలో మత్స్యకారులు ఎవరైన గిట్టని వారు విషం కలిపారని అనుమానిస్తూ ఉంటారు. విషం కలిపిన ఎడల కార్పు జాతి చేపలే కాకుండా కోర్రమట్ట (మర్రల్), మార్పు, జెల్లలు, మొ. ప్రాణవాయువు తక్కువగా ఉన్న పరిస్థితులను తట్టుకునే చేపలు మరియు కప్పలు, నీటి పాములు కూడా చనిపోవాలి. కనుక అటువంటి అనుమానాలు నిజమా కాదా అని నిర్ధారణ చేసుకోవడం చాల అవసరం.
చేపలు చనిపోయినప్పుడు వెంటనే చనిపోయిన చేపలను తొలగించి చెరువుకు దూరంగా కాల్చివేయాలి లేదా ఒక గోతి తీసి అందులో పూడ్చి వెయ్యాలి. లేని ఏడల నీరు కలుషితం అగుట వలన చెరువులో చేపల సంపద మొత్తం చనిపోయే పరిస్థితులకు దారితీస్తుంది నీటి నాణ్యతను మెరుగుపరుచుటకు  సున్నాన్ని ఒక హెక్టారుకు 100 నుండి 250 కిలోల  మోతాదులో చల్లాలి. ఇంకా అదుపులోకి రాకుంటే నీటి నాణ్యత పెంచే రసాయనాలు అనగా బెంజాల్ కొలియం క్లోరైడ్,  ఒక హెక్టారుకు ఒక లీటరు చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. ఈ చర్యల వలన నీటి నాణ్యత పెరగడమే కాకుండా చేపల ఫై ఉన్న పరాన్న జీవులు చనిపోతాయి. తదుపరి కూడా ఎలాంటి మార్పు లేకపోతే చివరి అస్త్రంగా అంటి బయాటిక్ మందులను సూచించిన మోతాదులో మేతతో పాటు కలిపి ఇవ్వాలి. 
ప్రాణవాయువు పెంచుకోవడానికి చెరువులోని నీటిని మోటార్ల ద్వారా రీసైక్లింగ్ చేసుకున్న ఎడల విష వాయువులు తగ్గి ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. పైన తెలిపిన సందర్బాలలో చేపలను పట్టి వేయడం అత్యంత శ్రేయస్కరం.  
చికిత్స కన్నా వ్యాధినివారణ మేలు అనే సూక్తిని అనుసరించి మేలైన యాజమాన్య పద్దతులను అవలంభించి ఆర్ధిక నష్టముల బారిన పడకుండా చూసుకొనవలసిందిగా కోరుచున్నాము.