పటిష్ట సహకారంతో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహిద్దాం : కలెక్టర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పటిష్ట సహకారంతో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహిద్దాం : కలెక్టర్

కర్నూలు, మార్చి 09 (way2newstv.com
పటిష్ట సహకారంతో నిష్పక్షపాతంగా, శాంతియుతంగా, పారదర్శకంగా రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిద్దామని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. శనివారం మంత్రాలయం హోటల్ అబోడ్ నందు కర్నూలు జిల్లా సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ జిల్లాల కలెక్టర్లు, ఎస్.పీ లతో ఆయన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్ణాటకలోని సరిహద్దు జిల్లాలైన బళ్లారి, రాయచూరు, తెలంగాణ లోని సరిహద్దు జిల్లాలైన గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో చెక్ పోస్టులను బలోపేతం చేయాలన్నారు. ఈ సరిహద్దు జిల్లాలనుండి మన కర్నూలు జిల్లాలోకి మద్యం, నగదు, అరాచక శక్తులు రాకుండ సరిహద్దు చెక్ పోస్టులందు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు మనమందరం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి ఆ నియోజకవర్గ పరిధిలోనే వాహనంలో తిరగాల్సి ఉంటుందన్నారు. ఇతర నియోజకవర్గాల్లో కానీ, జిల్లాలలో కానీ పర్యటించాల్సి వస్తే ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. 


పటిష్ట సహకారంతో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహిద్దాం : కలెక్టర్ 

జిల్లా ఎస్పీ పక్కీరప్ప మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లా ప్రాంతాలైన మాధవరం, మొగలుదొడ్డి, పెద్ద హరివాణం, హెచ్. బాపురం, మార్ల ముడికి, హాలహర్వి, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన నాగులదిన్నె, సుంకేసుల, పంచలింగాల , శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట తదితర ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ చెక్ పోస్టులందు సి సి కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పటిష్ట నిఘాను పెంచుతామన్నారు. అక్రమ మద్యం నిల్వలున్న ప్రాంతాన్ని గుర్తించి దాడులు చేసి కేసులను నమోదు చేయాలని ఆబ్కారీ   శాఖాధికారులను ఆదేశించారు. సరిహద్దు జిల్లాలో ఓటు వేసి తిరిగి కర్నూలు జిల్లాలో ఓటు వేసేందుకు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి రాగానే చెక్ పోస్టులందు వాహనం నెంబర్, డ్రైవర్ పేరు, మొబైల్ నెంబర్ తో పాటు వాహనం ఫోటో తీసుకోవడం జరుగుతుందన్నారు. నియోజకవర్గాల వారీగా క్రిమినల్ కేసుల వివరాలు, అన్ని లాడ్జిల వివరాల జాబితాను సిద్ధం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. 
కర్ణాటక రాష్రంలోని రాయచూరు జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేస్తున్న చెక్ పోస్టులకు 100 మీటర్ల దూరంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘాను పెంచుతామన్నారు. స్టాటిస్టికల్ సర్వవలెన్సు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ రోజున సరిహద్దు రాష్ట్రాల అధికారులందరు అప్రమత్తంగా ఉందామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులందరు వాట్సప్ గ్రూపును క్రియేట్ చేసుకుని పరస్పరం సమాచారాన్ని మార్పిడిని చేసుకుందామన్నారు. 
ఈ కార్యక్రమంలో రాయచూరు ఎస్పీ కిషోర్, గద్వాల్, బళ్లారి ఎస్పీలు, నాగర్ కర్నూలు జేసి, ఆదోని ఆర్డీవో రామమూర్తి, కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని ఆర్వోలు, తదితర అధికారులు పాల్గొన్నారు.