జాబు రావాలంటే బాబు పోవాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జాబు రావాలంటే బాబు పోవాలి

కర్నూలు, మార్చి 30, (way2newstv.com)
రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబు రావాలంటే బాబు పోవాలనే పరిస్థితి ఉందని వైకాపా  అధినేత జగన్ మోహన్రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో శనివారం ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు. డిగ్రీలు పూర్తయిన యువకులు పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్నారన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చి తప్పారన్నారు. ఉన్న ఉద్యోగాలు తీయించారు. సుమారు లక్షకు పైగా ఉద్యోగాలు తొలగించారు.ఐదేళ్ల పాలన తర్వాత దేశంలో అత్యధిక ధనిక సీఎంలలో ఒకరిగా బాబు మారారన్నారు. బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టేనా? అని ప్రశ్నించారు.  రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిన ఏకైక ఉద్యోగం లోకేశ్కు మాత్రమేనన్నారు. లోకేశ్ కు ఉద్యోగం ఇవ్వడమే కాదు ప్రమోషన్ కింద మంత్రి పదవి ఇచ్చారన్నారు. 


జాబు రావాలంటే బాబు పోవాలి

చంద్రబాబు వచ్చాక ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయాయన్నారు. ఉద్యోగులు జీతాలు పెంచమని అడిగితే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ అన్నారు. ప్రాజెక్టుల పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయని, రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.  బాబు పాలనలో అన్ని వర్గాలకూ అన్యాయమే జరిగిందన్నారు. సీఎంగా రైతులకు, నిరుద్యోగులను ఆదుకోవడం పక్కన పెట్టి పేదలసొమ్ముని దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాత్రం అత్యంత ధనికుడని, కానీ రాష్ట్రంలోని రైతులు మాత్రం అత్యంత పేదలుగా మిగిలిపోయారని అన్నారు.  ఏపీ రైతులు దేశంలోనే అత్యధిక రుణ భారంలో ఉన్నారన్నారు. కర్నూలు జిల్లాలో మొదటి పంటకు సరిగా నీరివ్వడం లేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అయన అన్నారు. నందికొట్కూర్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న తొగురు ఆర్థర్ని, ఎంపీ అభ్యర్థి బ్రహ్మనందరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.