కర్నూలు, మార్చి 27 (way2newstv.com)
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు... పార్టీని వీడిన సీనియర్ నేత ఎస్పీవై రెడ్డి కుటుంబానికి ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు... టీడీపీకి గెలుపు కోసం సహకరించాలని జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి, ఆయన కుటుంబాన్ని కోరారు. మంగళవారం నంద్యాలలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు... టీడీపీ విజయానికి సహకరిస్తే ఆయన కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆఫర్ చేశారు. గత ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.
ఎస్పీవై రెడ్డి కి ఎమ్మెల్సీ పదవీ ఆఫర్
అయితే ఈ సారి నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో ఏ ఒక్కటి తమ కుటుంబానికి కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీవై రెడ్డి... పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనలో చేరారు. జనసేనలోని చేరిన ఎస్పీవై రెడ్డి కుటుంబానికి జనసేన ఏకంగా నాలుగు టికెట్లు కేటాయించింది. ఎస్పీవై రెడ్డికి నంద్యాల ఎంపీ, ఆయన అల్లుడు శ్రీధర్ రెడ్డికి నంద్యాల ఎమ్మెల్యే, కుతూరు సుజలకు శ్రీశైలం, మరో కూతురు అరవింద వాణికి బనగానపల్లికి టికెట్లు కేటాయించారు పవన్. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉండటంతో... జనసేనలోకి వెళ్లిన ఎస్పీవై రెడ్డిని తిరిగిరావాలని చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది. మొత్తానికి జనసేనలోకి వెళ్లిన ఎస్పీవై రెడ్డి కుటుంబం... చంద్రబాబు ఆఫర్‌కు ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.