మచిలీపట్నం, ఏప్రిల్ 1(way2newstv.com):
జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ ఇళ్లను మంజూరు చేసి పేదల సొంతింటి కల నెరవేర్చింది. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి చేయూత అందించింది. ఇళ్ల నిర్మాణంలోనూ రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. పట్టణ గృహనిర్మాణ పథకంలోనూ మొదటి స్థానంలో నిలిచింది. పూర్తి చేసిన ఇళ్ల నిర్మాణాలకు ఆడంబరంగా సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించి పండగ చేసింది. ఎంతో మంది కలగా మారిన ఇంటిని సొంతం చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.జిల్లాలో గత నాలుగేళ్లలో దాదాపు 1.2 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 87,038 ఇళ్లు నిర్మాణం ప్రారంభించగా దాదాపు 54,948 పూర్తి చేసుకోగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇసుక ఉచితంగా అందించారు. గత ప్రభుత్వాలు మంజూరు చేసిన నామమాత్రపు యూనిట్ ధర ఏమూలకు సరిపోకపోవడంతో లబ్ధిదారులు వెనుకంజ వేశారు. గతంలో రూ.75వేలు ఉన్న యూనిట్ ధర పెంచుతూ 2016 నుంచి పక్కా ఇళ్లు మంజూరు చేశారు. పథకాలను బట్టి రూ.1.5లక్షల నుంచి రూ.3.5లక్షల వరకు మంజూరు చేయడంతో లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు లభించింది. మార్గదర్శకాలను సడలించి యూనిట్ విలువ పెంచి మంజూరు చేయడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం కలిగిన లబ్ధిదారులకు పక్కా ఇళ్ల పథకాలు ఉపకరించాయి. ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ లబ్ధిదారుల వాటా పోనూ మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరించింది.
నెరవేరిన సామాన్యుడి కల (కృష్ణాజిల్లా)
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా అఫర్డబుల్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. పట్టణ ప్రాంతాల్లో వివిధ కేటగిరీల కింద ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దీని కోసం టిడ్కో ఏర్పాటు చేసి నిర్మాణం చేపట్టింది. దీని కింద బహుళ అంతస్తుల భవనాలను నిర్మాణం చేసి లబ్ధిదారులకు కేటాయిస్తున్నారు. అందరికీ ఇళ్లు కార్యక్రమం కింద వీటిని చేపట్టారు. రాష్ట్రంలో మొత్తం 5,95,913 ఇళ్లు మంజూరైతే కృష్ణా జిల్లాకు 91,138 ఇళ్లు మంజూరు కావడం విశేషం. దీని కింద రూ.1.5లక్షల వరకు రాయితీ వస్తోంది. మూడు కేటగిరీల కింద నిర్మాణం చేపట్టారు.
జిల్లాకు అఫర్డబుల్ హౌసింగ్ స్కీం (ఏహెచ్‌పీ) కింద 91138 ఇళ్లు మంజూరు కాగా 49489 ఇళ్లు టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. దీనిలో 37,950 ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. స్లాబు వరకు పూర్తి చేసిన ఇళ్లు 14,751 ఉన్నాయి. విజయవాడ జక్కంపూడి కాలనీలో భారీ ఎత్తున ఐదు దశల్లో దాదాపు 55వేల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వీటికి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలను సంస్థ కల్పించడం విశేషం. భాగస్వామ్య పద్ధతిలో అందుబాటు ధరల్లో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లను నిర్మాణం చేయడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో దాదాపు రూ.4,677.11 కోట్లతో ఈ ఏహెచ్‌పీ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు.