ఆదిలాబాద్, ఏప్రిల్ 1(way2newstv.com)
ఆదిలాబాద్ జిల్లాలో మొరంను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో మొరం తవ్వి తరలిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు చోట్ల జరుగుతున్న పారిశ్రామీకరణకు రహదారుల నిర్మాణానికి అవసరమయ్యే మొరాన్ని వారు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. రూ. కోట్లు గడిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్నో ప్రభుత్వ భూములను తవ్వేశారు. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.జిల్లా విభజన తర్వాత ఆదిలాబాద్ పట్టణంలోని టేెలర్స్, టీచర్స్, న్యూహౌజింగ్‌బోర్డు, ఆదర్శనగర్ పలు కాలనీల్లో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. పంట పొలాలతో కళకళలాడే శివారు భూములన్నీ ప్లాట్లుగా మారాయి. దీంతో గృహనిర్మాణం, పారిశ్రామికరణ, ఆయా కాలనీలల్లో రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతుండటంతో వాటికి అవసరమైన మొరంను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రహదారుల మీదుగా ప్రతి నిత్యం పదుల సంఖ్యలో రాత్రి పగలు అన్న తేడాలేకుండా టిప్పర్లు వెళ్తున్నప్పటికీ అధికారులు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ తవ్వకాలతో గుంతలు ప్రమాదకరంగా తయారయ్యాయి. దీంతో కజ్జర్ల గ్రామస్థులు మొరం తవ్వకాలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా పాలనాధికారి దృష్టిసారించి కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
వ్యవసాయభూమిలో లేఅవుట్ చేయాలంటే మొదట భూమి విలువలో 1 శాతం రుసుము రెవెన్యూశాఖకు చెల్లించి వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. తర్వాత డీటీపీసీ నుంచి అనుమతులు పొంది లేఅవుట్‌లు వేసుకోవాలి. అయితే జిల్లాలో కొంతమంది అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో గుత్తేదారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న మొరం తవ్వకాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని తేలింది. ఇకనైనా అధికారులు ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది.భూమిని చదును చేసేందుకు వీలుగా మొరం తరలించాలంటే కచ్చితంగా గనుల శాఖ నుంచి అనుమతులు పొందాలి. పట్టా భూముల్లో మొరం తరలించాలంటే హెక్టారుకు రూ.40 వేల చొప్పున గనులశాఖకు డిపాజిటు చేయాల్సి ఉంటుంది. క్యూబిక్ మీటరుకు రూ.30 చెల్లించాలి. దీంతో పాటు 2 శాతం ఆదాయం పన్ను, ఒక శాతం కార్మిక పన్ను కట్టాల్సి ఉంటుంది. కాని ఆదిలాబాద్ పట్టణానికి అనుకొని ఉన్న కజ్జర్ల, మావల, పొన్నారి, బట్టిసావర్గాం, నేరడిగొండ, ఇచ్చోడ, తదితర ప్రాంతాల్లో, పల్లెల్లో మొరం తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల నుంచి మొరం తవ్వకాలు అసలే చేయరాదు. కాని ఆదిలాబాద్ చుట్టూ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల నుంచి మొరం తవ్వకాలు యథేచ్ఛగా చేస్తున్నారు.