మచిలీపట్నం ఏప్రిల్ 08 (way2newstv.com)
నా సుదీర్ఘ 3648 కిమీ పాదయాత్ర మచిలీపట్నం నుంచి కూడా సాగింది. ఆరోజు ఇక్కడి వారు చెప్పిన ప్రతి సమస్య నాకు గుర్తుంది. ఇక్కడ పోర్టు వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని అందరూ కల గంటున్న విషయం కూడా చెప్పారని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం అయన మచిలీపట్నం లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇక్కడ పోర్టు కోసం వైయస్సార్ నాడు శంకుస్థాపన చేశారు. అందు కోసం 4800 ఎకరాల భూసేకరణకు కూడా ప్రయత్నించారు. దాన్ని విభేదించిన చంద్రబాబు పోర్టుకు అంత భూమి అవసరం లేదని, కేవలం 1800 ఎకరాలు చాలని వాదించారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక అన్నీ మర్చిపోయి ఏకంగా 33 వేల ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. రాత్రికి రాత్రి జీఓ ఇచ్చారని అన్నారు. పరిహారం చెల్లింపులోనూ చంద్రబాబు రైతులకు అన్యాయం చేశారు. ఆ రైతులందరికీ చెబుతున్నాను. నేను ఉన్నాను. పోర్టుకు 4800 ఎకరాలు చాలు. అంతకు మించి భూసేకరణ అవసరం లేదు. ప్రభుత్వం ఏర్పడితే పోర్టు నిర్మాణం జరుగుతుంది. మచిలీపట్నం ప్రజలకు ఏం చేయకపోయినా, భూకబ్జాలు జోరుగా సాగుతున్నాయి. స్మశానాలు, బహిరంగ టాయిలెట్లు కూడా వదిలి పెట్టడం లేదు.
మేనిఫెస్టోతో మోసం
పట్టణంలో 10 వేల మంది ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేశారు. మా ప్రభుత్వం ఏర్పడితే వారందరికీ తప్పనిసరిగా స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా కట్టించి ఇస్తామని అన్నారు. మచిలీపట్నంలో వేల మంది రోల్డ్ గోల్డ్ నగల తయారీపై ఆధారపడి బతుకుతున్నారు. వారి ప్రాధాన్యత గుర్తించి పోతెపల్లిలో 45 ఎకరాల్లో ఇమిటేషన్ పార్కు ఏర్పాటు చేస్తే, అక్కడ నీరు సరఫరా చేయడం లేదు. కరెంటు ఛార్జీలను యూనిట్ రూ.3.75 నుంచి పెంచి రూ.7 నుంచి రూ.9 వరకు వసూలు చేస్తున్నారు. మరి పేదలు ఎలా బతుకుతారు? పార్టీ అధికారం చేపడితే ఆ పార్కులో నీరివ్వడమే కాకుండా, విద్యుత్ ఛార్జీ కూడా రూ.3.75కు తగ్గిస్తాం. చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేలు ఇస్తాం. గ్రామ వాలంటీర్ ద్వారా ఆ సేవ డోర్ డెలివరీ చేస్తాం. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో మనం చూసింది మోసం మాత్రమే. మళ్లీ మోసం చేయడానికి పసుపు–కుంకుమ పథకం తీసుకొచ్చారు. నిజానికి ఆ పథకంలో పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చింది ఏమీ లేదు. వ్యవసాయ రుణాలదీ అదే పరిస్థితి. రైతులకు చంద్రబాబు చాలా నష్టం చేశారు. నిరుద్యోగ భృతి ఎగ్గొట్టి యువతను మోసగించారు. ఈ పరిస్థితి పూర్తిగా మారాలి. 2014 ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు, ఏవీ నెరవేర్చలేదు. ఇప్పుడు అదే ఫోటోతో 34 పేజీల మేనిఫెస్టోతో మోసం చేస్తున్నారు. గత ఎన్నికల ప్రణాళికలో చెప్పినవే కాకుండా, చెప్పనివి కూడా అమలు చేశామని, అన్నింటినీ ప్రణాళికా బద్దంగా అమలు చేశామంటున్నారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. అందుకు మీ అందరి సహకారం కావాలని జగన్ కోరారు