తెలంగాణలో పాలిటెక్పిక్ డిప్లోమాకు అవకాశాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో పాలిటెక్పిక్ డిప్లోమాకు అవకాశాలు

హైద్రాబాద్, ఏప్రిల్ 9, (way2newstv.com)
రాష్ట్రంలో ఇంజనీరింగ్ డిగ్రీ పొందిన వారి కంటే పాలిటెక్నిక్ డిప్లమో చేసిన వారికే అత్యధికంగా ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయని దాంతో పాలిటెక్నిక్ డిప్లమోకు మంచి గిరాకీ పెరిగిందని సాంకేతిక విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ సీట్లకు దాదాపు సమాన సంఖ్యలోనే అభ్యర్థులు ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష రాస్తున్నారని, అదే పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షకు వచ్చే సరికి రెండు రెట్లు, మూడు రెట్లు అధికంగా పరీక్ష రాస్తున్నారని చెబుతున్నారు. దీనికి కారణం పాలిటెక్నిక్ తర్వాత ఉపాధి అవకాశాలు , విద్యావకాశాలు మెండుగా ఉండటమేనని వారు వివరిస్తున్నారు. పాలిటెక్నిక్ చేసిన వారు లేటరల్ ఎంట్రీ ద్వారా ఇసెట్ పరీక్షకు హాజరై నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరవచ్చు. ఇసెట్‌కు మొత్తం ఇంజనీరింగ్‌లో 10 శాతం వరకూ సీట్లు అందుబాటులో ఉండటంతో పాలిటెక్నిక్ చేసిన వారు మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో రెండో సంవత్సరంలో సీటు పొందడం తేలికగా మారింది. ఇంజనీరింగ్ కాదనుకుంటే తాజాగా పాలిటెక్నిక్ చేసిన వారికి దోస్త్ ద్వారా అండర్ గ్రాడ్యూయేట్ కోర్సుల్లో చేరేందుకు వీలుకల్పించారు. పాలిటెక్నిక్ చేసిన వారు నేరుగా బీఏ, బీకాం, బిఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు, అది కూడా కాదనుకుంటే నేరుగా ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ఇటు న్యాయవిద్యలోనూ అటు ఎమ్మెస్సీ లేదా ఎంఏ కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంది. 


తెలంగాణలో పాలిటెక్పిక్ డిప్లోమాకు అవకాశాలు

దూరవిద్య ద్వారా కూడా డిగ్రీలో చేరేందుకు వీలుంది. ఈ అవకాశాలతో పాటు పాలిటెక్నిక్ చేసిన వారికి ఆయా ట్రేడ్‌లలో సేవల రంగంలో వెంటనే ఉద్యోగాలు దక్కుతున్నాయి. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారికి ప్రభుత్వ , ప్రైవేటు సంస్థల్లో నీటిపారుదల, ప్రజారోగ్యం, రవాణా, రైల్వేలు, భవనాలు శాఖ, సర్వే శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. వీరు బీటెక్‌లో సివిల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో చేరవచ్చు. ఆర్కిటెక్చర్, మెకానికల్, ఆటోమెబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ - ఇనుస్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ , కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్, గార్మెంట్ టెక్నాలజీ, క్రాఫ్ట్ టెక్నాలజీ, హోం సైన్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, కెమకల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, లెదర్ టెక్నాలజీ, ఫుట్ వేర్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ (ఆయిల్‌టెక్నాలజీ), పెట్రోకెమికల్ , ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్, సెరామిక్ ఇంజనీరింగ్ , టెక్స్‌టైల్ టెక్నాలలో అవకాశాలు కోకొల్లలున్నాయి. పాలిటెక్నిక్ చేసిన వెనువెంటనే ఉద్యోగాలు లభిస్తుండగా, ఇంజనీరింగ్ చేసిన వారిలో కేవలం 20 శాతం మందికి మాత్రమే తక్షణ ఉద్యోగాలు దక్కుతున్నాయని అసోచమ్ సర్వే చెబుతోంది. ఈ ఏడాది పాలిటెక్నిక్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ గడువు ఉంది. ప్రవేశపరీక్ష ఏప్రిల్ 16న నిర్వహించనున్నారు. పాలిసెట్ ఫలితాలను ఏప్రిల్ 24వ తేదీన ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ సంస్థల్లో రెగ్యులర్, రెండో షిఫ్ట్‌తో కలిపి దాదాపు 63వేల సీట్లున్నాయి.