తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం

నల్లగొండ, ఏప్రిల్ 9, (way2newstv.com)
తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే కన్‌క్లూజివ్ టైటిల్ యాక్ట్‌ను అమలు చేస్తున్న దేశాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ టైటిల్‌ను ఏ రాష్ట్రం కూడా అమలు చేయడం లేదు. మొదటగా తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి తీసుకురావాలన్న కెసిఆర్ కృతనిశ్చయంతో ఉన్నట్టు సమాచారం. దీనిని అమలు చేస్తే కొనుగోలు దారులకు పూర్తి స్థాయిలో మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ దీనినే ప్రభుత్వం అమలు చేస్తే కొత్త చట్టం ప్రకారం భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌పై సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్‌లకు అధికారం ఉండదు. ప్రభుత్వం ప్రతిపాదించే స్వతంత్ర వ్యవస్థ చూసుకుంటుంది. ఇప్పటికే అటవీ భూముల సర్వే అయిపోగా, దేవాదాయ, పోడు భూములకు సంబంధించిన సర్వే పనులు కొనసాగుతున్నాయి. ఈ లెక్కలు తేలగానే ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. న్యాయపరమైన వివాదాలు లేకుండా తెలంగాణకే అనుకూలమైన ప్రత్యేక చట్టాల దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వందకుపైగా ఉన్న భూ చట్టాలను సంస్కరించి తెలంగాణకు పనికిరాని పలు చట్టాలను తొలగించేలా ముసాయిదాకు ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పటికే 50కి పైగా భూ చట్టాలను తెలంగాణ ప్రభుత్వం సంస్కరించింది. కొత్త చట్టాలపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ సలహాలను ప్రభుత్వం తీసుకుంటుంది. వారి సూచనల మేరకు కీలకమైన సవరణ బాధ్యతలను నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి అప్పగించింది. 


తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం

నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 47 చట్టాలను తెలంగాణకే పరిమితమైన 18 చట్టాలను ప్రాథమికంగా లాండె సా రూరల్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ అధ్యయనం చేసి గుర్తించింది. వీటిని పరిగణలోకి తీసుకొని ప్రభు త్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.అధికారులు కంక్లూజివ్ టైటిల్ చూసిన తరువాతే మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ టైటిల్‌ను అమల్లోకి తీసుకొస్తే పూర్తి స్థాయి పారదర్శకతతో వ్యవహారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ అధికారులు కంక్లూజివ్ టైటిల్ చూడకుండా రిజిస్ట్రేషన్ చూస్తే తరువాత జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖలో ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అనంతరం జరిగే పరిణామాలకు ఆ శాఖకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ అమల్లోకి తీసుకొస్తే అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంటుంది. అందులో భాగంగానే సిఎం కెసిఆర్ ఈ యాక్ట్‌ను అమల్లోకి తీసుకురావడానికి కృతనిశ్చయంతో ఉన్నారని, ఇప్పటికే అధికారులు సైతం దీనిపై నివేదికను తయారు చేసే పనిలో ఉన్నట్టు తెలిసింది. ఈ నెల రెండో వారంలోగా దీనిపై సిఎం కెసిఆర్ ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. కంక్లూజివ్ టైటిల్ యాక్ట్‌ను అమలు చేస్తున్న దేశాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై వివరాలు సేకరించాలని ఇప్పటికే సిఎస్ ఆదేశించడంతో అధికారులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు.రెవెన్యూ శాఖపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిఎం కెసిఆర్ సంస్కరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కెసిఆర్ పలు సభల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి కీలక మార్పులు ఉంటాయని ప్రకటించిన నేపథ్యంలో ఆ శాఖకు చెందిన ఉద్యోగులు సైతం సిఎంను కలిసి ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అధికారులకు ఇబ్బంది కలగకుండా కొత్త విధానం తీసుకురావాలని, దానివలన రైతులు, ప్రజలు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండకూడదని కెసిఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా లాగే దీనిని కూడా మిగతా రాష్ట్రాల కన్నా భిన్నంగా ఉండడంతో పాటు రైతులకు, భూ యజమానులకు మేలు చేసేలా ఉండేలా చూడాలని, కొత్త చట్టానికి ఆ దిశగా రూపకల్పన చేయాలని అధికారులను సైతం ఆదేశించినట్టు తెలిసింది. జూన్ లేదా ఆగస్టులో పూర్తి స్థాయిలో కొత్త రెవెన్యూ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని కెసిఆర్ నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు సైతం ఆ చట్టంలో చేయాల్సిన మార్పులతో పాటు కొత్త వాటిని చేర్చడంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ చట్టం గతంలో ల్యాండెసా, నల్సార్ లా యూనివర్శిటీలు రూ పొందించిన ముసాయిదా చట్టాన్ని పరిశీలనకు తీసుకోకుండా ప్రైవేటు థర్డ్ పార్టీ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ల శాఖలను భూ వ్యవహారాల నుంచి పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగా భూమి హక్కు గ్యారంటీ వ్యవస్థను తెరపైకి తీసుకురావాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తున్నారు. కానీ టైటిల్ ద్వారా హక్కులు లభించడం లేదు. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ చట్టం తీసుకురావడానికి ముందు సమగ్ర కసరత్తు జరగాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సమగ్ర భూముల సర్వే రూపంలో క్షేత్రస్థాయి సర్వేను నిర్వహించి భూ రికార్డుల వాస్తవికతను నిర్ధారించాల్సి ఉంది. ఆ విధంగా రూపొందించిన రికార్డుల తరువాత వివాదాలను తొలగించేందుకు ప్రత్యేక వ్యవస్థను తెరపైకి తీసుకువస్తే బాగుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. చట్టంలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా మ్యుటేషన్లలో అధికారుల ప్రమేయం లేకుండా చూడాలన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. వీలైతే వీటిని థర్డ్‌పార్టీకి అప్పగించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.