అదిలాబాద్, ఏప్రిల్ 2 (way2newstv.com)
అంగన్‌వాడీ కేంద్రాలను ప్లే స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో 992 ప్రధాన, 264 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో మూడు సంవత్సరాల లోపు చిన్నారులు 30,503 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు 21,685 మంది పిల్లలున్నారు. కేజీ టూ పీజీ విద్యావిధానంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాల ఆవరణలోని ప్లే స్కూళ్లుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నో యువర్ డిస్ట్రిక్ట్ నివేదికల ప్రకారం 87,292 మంది 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలున్నారు. వీరిలో దాదాపు 35 వేలకు చిన్నారులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వీరు ఇంగ్లిషు మీడియం పాఠశాలలకు పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది చిన్నారులు బడికిపోవడం లేదు. గ్రామాల్లోని చిన్నారులకు ప్రాథమిక స్థాయిలో మెరుగైన విద్యను అందించడానికి చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆవరణలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను జిల్లాలోని ఆయా గ్రామాల ఆవరణలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను గుర్తించి వాటికి అక్కడికి తరలిస్తారు.
సర్కారీ ప్లే స్కూళ్లలలో ఇంగ్లీషు మీడియం
2017-18 విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటారు. పాఠశాలల పరిధిలోని జిల్లాలో ఎంపిక చేసిన అంగన్‌వాడీ కేంద్రాలు ఏప్రిల్ 15 లోగా శిశు సంక్షేమ అధికారులు విధివిధానాలు తయారుచేస్తారు. జిల్లా వ్యాప్తంగా అన్ని వసతులున్న ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసి నివేదికలు అందజేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. జాన్ 12 నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో నిడిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. పిల్లల మనస్తత్వాన్ని బట్టి వారికి ఎలా విద్యను అందించాలనే అంశాలను నేర్పడంతో పాటు చిన్నారులకు ఆటా, పాటాలతో కూడిన చదువులు అందించే విధంగా శిక్షణ ఇస్తారు. చదువు నేర్పుతూ పౌష్ఠికాహారాన్ని అందిస్తారు. జిల్లాలో పలు అంగన్‌వాడీ కేంద్రాలు వసతులు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పక్కా భవనాలు, మౌలిక వసతులు లేక చిన్నారులు, తల్లులు, సిబ్బంది పలు ఇబ్బందులు పడుతున్నారు. ప్లే స్కూళ్ల ఏర్పాటులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలకు తరలించడంతో చిన్నారులకు, సిబ్బందికి అన్ని రకాల వసతులు కలుగుతాయి. పర్యవేక్షణ, సూళ్ల నిర్వహణలో సైతం ఎలాంటి సమస్యలు ఉండవు. ప్లే స్కూళ్లకు వచ్చే చిన్నారులకు తెలుగు, ఇంగ్లిషు మీడియంలో బోధన చేయనున్నారు.
ప్లే స్కూళ్లకు వచ్చే చిన్నారులకు చదువుతో పాటు వివిధ విషయాలపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వం త్వరలోనే ఓ పుస్తకాన్ని రూపొందించనుంది. రాష్ట్ర విద్యాశిక్షణ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని తయారు చేస్తున్నారు. చిన్నారుల కోసం యూనిసెఫ్ రూపొందించిన పుస్తకాలను పరిశీలించి ఈ పుస్తకాన్ని తయారుచేయనున్నట్లు తెలిసింది.