కందుల రైతుల కష్టాలు ఇంతింత కాదయా.... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కందుల రైతుల కష్టాలు ఇంతింత కాదయా....

అదిలాబాద్, ఏప్రిల్ 2, (way2newstv.com)
కంది రైతుల  కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.కందుల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి మార్కెట్ యార్డుకు తరలించి రేయింబవళ్లూ అక్కడే ఉంటున్నా ఎప్పుడు కొనుగోలు కేంద్రం తెరుస్తారు...? ఎప్పుడు టోకెన్లు ఇస్తారు..? అన్న దానికి సమాధానమే దొరకడం లేదు..తర్వాత ఒక్కరోజు మాత్రమే కొనుగోలు సాగాయి. గన్నీ బ్యాగుల కొరత, కొనుగోలు చేసిన కందులు తరలించడంలో జాప్యం జరుగుతండడంతో అధికారులు తరుచూ కొనుగోళ్లు నిలిపివేస్తున్నారు. పరిమితికి మించి టోకెన్లు జారీ చేస్తుండడంతో రైతులు ఒక్కసారిగా మార్కెట్‌కు తరలివస్తున్నారు. దీంతో మార్కెట్ యార్డు కందులతో నిండిపోయింది. దళారులు మద్దతు ధరకన్నా తక్కువకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో రోజుల తరబడి వేచి ఉండలేక ఏదో ఒక ధరకు అమ్ముకొని ఇంటి ముఖం పడుతున్నారు. ఇలా రైతుల వద్ద కొన్న కందులను వారి పేరిటే మార్కెట్ యార్డులో మద్దతు ధరకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. రోజువారీగా.. 300 కూపన్లు జారీచేసి కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఒక్కో కూపన్‌ను రూ.200 నుంచి 300 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు విపిస్తున్నాయి. దీంతో మార్కెట్‌కు లెక్కకు మించి కందులు రావడంతో గన్నీ బ్యాగుల కొరత ఏర్పడుతోంది. వారంలో రెండు లేదా మూడు రోజలు కందులను కొనుగోలు చేసి నిలిపి వేస్తున్నారు. 


కందుల రైతుల కష్టాలు ఇంతింత కాదయా....

దీంతో రైతులు గత్యంతరం లేక దళారులకు విక్రయిస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు తిరిగి కందులు కొనుగోళ్లు చేపట్టగా తక్కువ ధరకు రైతుల వద్ద కొన్న దళారులు రైతుల బినామీ పేర్లపై ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌యార్డు సామర్థ్యాన్ని బట్టి రోజుకు 300 కూపన్లు జారీ చేసి కొనుగోళ్లు చేయాలని నిర్ణయించారు. అయితే అధికారులు మాత్రం కాసులకు కక్కుర్తి పడి డిమాండ్‌ను బట్టి ఒక్కో కూపన్‌కు రూ.200-300కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. లెక్కకు మించి కందులు మార్కెట్‌యార్డుకు రావడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కందులు అమ్మడానికి మార్కెట్‌యార్డుకు తీసుకువస్తే రెండు, మూడు రోజుల పాటు అక్కడే బస చేయాల్సి వస్తోంది. రైతులు భారీగా కందులను తీసుకురావడంతో మార్కెట్‌యార్డులో స్థలం లేకుండా పోయింది. దీంతో ఆరుబయటే కందులను నిల్వ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజుల క్రితం అకాల వర్షం కురియడంతో కందులన్నీ తడిసిపోయాయి. మార్కెట్‌యార్డులో సరిపడా తాటిపత్రులు లేకపోవడంతో తడిసిన ధాన్యాన్నే అధికారులు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు 2.50 లక్షల క్వింటాళ్ల కందులను కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో 60 శాతం కందులు దళారులదేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గన్నీ బ్యాగుల కృత్రిమ కొరత సృష్టించి కందులు కొనుగోలు చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డుకు తీసుకవస్తే అధికారుల పర్యవేక్షణ కరువవుతోంది. దీంతో దళారులు ఇష్టానుసారంగా మార్కెట్‌లో వ్యవహరిస్తున్నారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు రైతుల బినామీ పేర్లపై విక్రయాలు చేస్తున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరగడంపై అధికారుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొంత మంది దళారులు వేల క్వింటాళ్ల కందులను రైతుల వద్ద కొనుగోలు చేసి అక్రమంగా గోదాంలలో నిల్వ ఉంచుతున్నారు. అప్పుడప్పుడు విజిలెన్స్ అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన గోదాంలపై దాడులు నిర్వహించి కందులను సీజ్ చేస్తున్నారు. ముందస్తుగా అధికారులు రైతుల నుంచి కందులను దళారులు కొనుగోలు చేయకుండా అరికడితే రైతులు మోసపోకుండా ఉండేవారు. ఇదంతా చూస్తుంటే అధికారులు, దళారులు కుమ్మక్కై గన్నీ బ్యాగుల కృత్రిమ కొరతను సృష్టించి రైతుల కందులను దళారులతో కొనుగోలు చేయించి రైతుల బినామీ పేర్లపై కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ముందస్తు చర్యలను తీసుకొని కందుల కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.