బెంగళూర్, ఏప్రిల్ 15, (way2newstv.com)
మాండ్య నియోజకవర్గంలో పోరు తారాస్థాయికి చేరింది. తొలినాళ్లలో గెలుపు సులువనుకున్న జనతాదళ్ ఎస్ అభ్యర్థి, దేవెగౌడ మనవడు నిఖిల్ గౌడకు రోజురోజుకూ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిఖిల్ గౌడకు ఉన్న ఏకైక ఆశ తాము అధికారంలో ఉండటం… ఈ నియోజకవర్గంలో ఎక్కువమంది తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండటమే. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ స్వతంత్ర అభ్యర్థి సుమలత బలోపేతం అవుతున్నారు. నిఖిల్ గౌడ్ ను ఓడించడమే లక్ష్యంగా సుమలత చేస్తున్న సుడిగాలి పర్యటనలు సత్ఫలితాలిస్తున్నాయి.సుమలత ప్రచారానికి మాండ్య నియోజకవర్గంలో మద్దతు బాగా లభిస్తుంది. అంబరీష్ సతీమణిగా ఆమెకు జనం నీరాజనాలు పడుతున్నారు. దీంతోపాటుగా కాంగ్రెస్ నేతలు, క్యాడర్ కూడా ఆమెకు బహిరంగంగా సపోర్ట్ చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇచ్చిన వార్నింగ్ లు వారిపై ఏమాత్రం పనిచేయలేదు.
మాండ్యాలో సుమలత గెలుపు నల్లేరు మీద నడకే
కుటుంబ రాజకీయాలను తిప్పికొట్టాలంటూ కాంగ్రెస్ నేతలు నేరుగానే మాండ్యలో వ్యాఖ్యలు చేస్తుండటం విశేషం. మరోవైపు భారతీయ జనతా పార్టీ మద్దతు దొరకడంతో సుమలత సేఫ్ జోన్లోకి ఇప్పటికే వెళ్లిందన్నది విశ్లేషకుల అంచనా.ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పినట్లు నడుచుకుంటారనే ఆరోపణలున్న మాండ్య జిల్లా అధికారి మంజుశ్రీపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఆమెను బదిలీ చేయడంతో సుమలత సగం విజయం సాధించినట్లేనని అంటున్నారు. మంజుశ్రీ స్థానంలో పి.సి.జాఫర్ అనే అధికారిని నియమించారు. మంజుశ్రీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సుమలత ఎన్నిలక కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మంజుశ్రీ బదిలీపై జనతాదళ్ ఎస్ నేతలు గరంగరంగా ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ కుట్రలో భాగమేనంటున్నారు.అలాగే సుమలతకు ఉన్న ఫాలోయింగ్ నిఖిల్ గౌడకు లేకపోవడం విశేషం. సుమలతపై సానుభూతి పవనాలు ఎక్కువగా వీస్తున్నాయని చెబుతున్నారు. దేవెగౌడ తన స్వార్థం కోసం,కుటుంబ సభ్యుడిని రంగంలోకి దించడం కోసం సుమలత సీటును లాక్కున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో కుమారస్వామి మాండ్య నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ సుమలతకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం మీద సుమలత సేఫ్ జోన్లోకి వెళ్లినట్లేనన్నది ఇప్పటి వస్తున్న విశ్లేషణల ప్రకారం అర్థమవుతోంది. చివరి నిమిషంలో మ్యాజిక్ జరిగితే తప్ప నిఖిల్ గౌడ విజయం సాధ్యమవ్వదన్నది అంచనా.