ఏలూరు, ఏప్రిల్ 15, (way2newstv.com)
మెగా ఫ్యామిలీ బ్రదర్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసిన సంగతి విదితమే. వీరు పోటీ చేసిన నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి ఎలా జరిగింది, మెగా బ్రదర్స్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ? ఈ ఎన్నికల్లో వీరు గట్టెక్కుతారా ? అన్న అంశంపై వారు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆసక్తికర చర్చలే నడుస్తున్నాయి. పోలింగ్‌కు ముందు వరకు ఈ మెగా బ్రదర్స్ ఇద్దరూ తమ సొంత జిల్లా ముఖం ఏ నాడు చూడలేదు, ఈ జిల్లా ప్రజల సమస్యలను పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. పవన్ మాత్రం ఒకటిరెండు సార్లు తుందుర్రు లాంటి సమస్యలపై ముక్తసరిగా స్పందించి వదిలేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో వీరిద్దరూ ప్రచారమే అంతంత మాత్రంగా చేసినా గురువారం పోలింగ్ రోజు వీరు ఆ నియోజకవర్గాల్లో కానరాలేదు. పశ్చిమగోదావరి జిల్లా ప్రతిష్ఠాత్మకమైన భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు నుంచి పవన్ కళ్యాణ్ గట్టి పోటీ ఎదుర్కొన్నారు. అటు నరసాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబుకు టీడీపీ అభ్యర్థి కలువపూడి శివ, వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు నుంచి గట్టి పోటీనే ఎదురైంది. ఇక వీరిద్దరికి ఇక్కడ ఓట్లు లేకపోవడంతో వీరు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది.
మెగా బ్రదర్స్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా
ప్రచారంలోనే నాగబాబు నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించినా సోదరుడు పోటీ చేస్తున్న భీమవరం అదే నియోజకవర్గంలో ఉన్న భీమవరం వైపు కన్నెత్తి చూడలేదు. ఈ మెగా సోదరులు పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లోనూ త్రిముఖ పోటీ ఉంటుందని అనుకున్నా నరసాపురంలో పోలింగ్‌కు ముందే నాగబాబు చేతులు ఎత్తేసినట్టే కనిపించింది.రఘురామ కృష్ణరాజు, కలువపూడి శివతో పాటు బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కె.ఎ. పాల్‌తో పాటు ఇతర పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు సైతం పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే జనసేన అభ్యర్థి నాగబాబు మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో సొంత పార్టీ కేడర్ సైతం షాక్ తింది. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న భీమవరంలో మాత్రం మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడిచింది. కాపు సామాజికవర్గం ఓటర్లలో మూడు ప్రధాన పార్టీ అభ్యర్థులు చీల్చుకోగా యువత ఎక్కువగా పవన్ వైపు మొగ్గు చూపింది. ఇక క్షత్రియ సామాజికవర్గంతో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌కు తీవ్రమైన విభేదాలు ఉన్న నేపథ్యంలో వారిలో మెజారిటీ వర్గం ఓటర్లు అసెంబ్లీ ఓటు వరకు పవన్‌కు సపోర్ట్ చేసినట్టు తెలిసింది.అదే టైమ్‌లో వారు ఎంపీ ఓటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కలువపూడి శివకు వేసినట్టు టాక్. క్షత్రియ సామాజికవర్గంలో యువత సైతం అసెంబ్లీ వరకు పవన్‌కు ఫుల్‌గా సపోర్ట్ చేసింది. ఈ నియోజకవర్గంలో ఎస్సీ వర్గాల్లో మెజారిటీ ఓటర్లు గ్రంధి శ్రీనివాస్ వైపు మొగ్గు చూపగా బీసీ ఓటర్లలో టీడీపీ, వైసీపీకి మొగ్గు కనపడింది. టీడీపీ అభ్యర్థి అంజిబాబు ఎన్నికలకు ముందు మూడో స్థానంతో సరిపెట్టుకుంటారని అనుకున్నా మహిళా ఓటింగ్ టీడీపీకి సానుకూలంగా ఉన్నట్టు టాక్ ఉండడంతో అనూహ్యంగా ఆయన సైతం ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ ట్రయాంగిల్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారు, ఎవరికి రెండు, మూడు స్థానాలు దక్కుతాయన్నది అంచనాకు అందడం లేదు. సొంత జిల్లాలో పోటీ చేస్తున్న మెగా బ్రదర్స్ పరిస్థితి ఇలా ఉంటీ మరి తుది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.