తిరువనంతపురం, ఏప్రిల్ 27, (way2newstv.com)
2019 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరోమారు అధికారంలోకి వస్తే... అది ఆ పార్టీకి జనాల్లో ఉన్న ప్రజాదరణ అని ఎంతమాత్రం చెప్పలేం. ఎలాగూ జనాల్లో మోదీ మేనియా తగ్గిందన్న విషయాన్ని ఎన్నికలకు ముందుగానే గుర్తించేసిన కమలనాథులు... ఎలాగైనా మరోమారు అధికారంలోకి రావాల్సిందేనన్న భావనతో... జనం ఓట్లేయకున్నా... ఎలా గెలవాలో పక్కాగానే ప్లాన్ గీసుకున్నారు. అందుకు వారు ఈవీఎంలే కేంద్రంగా పెద్ద కుట్రకే తెర తీశారు. ఇప్పటికే ఈవీఎంలపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీ తదితర పార్టీలన్నీ కూడా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా బీజేపీ గెలవాలని అనుకుంటోందని, ఈ క్రమంలోనే కౌంటింగ్ లో ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపుతో పాటు వాటిలోని వీవీ ప్యాట్ స్లిప్పులను కూడా కౌంట్ చేయాల్సిందేనని చంద్రబాబు సహా 21 పార్టీల అధినేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈవీఎంలు..నిజంగానే ట్యాంపరింగా
ఈ డిమాండ్ ను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేయడంతో వారంతా చంద్రబాబు ఆధ్వర్యంలోనూ సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఇప్పటికే మూడు దశల పోలింగ్ ముగియడం, ఇంకో నాలుగు విడతల పోలింగ్ మిగిలి ఉండటం, కౌంటింగ్ వచ్చే నెల 23న జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరిస్తుందని చంద్రబాబు అండ్ కో చాలా గట్టి నమ్మకంతోనే ఉన్నారు.అయినా చంద్రబాబు సహా ఇతర పార్టీల నేతలంతా ఈవీఎంలపై చేస్తున్న ఆరోపణలు అక్షరాల నిజమన్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఇందులో గోవాలో జరిగిన ఘటన బీజేపీ కుట్రను కళ్లకు కట్టేసిందనే చెప్పాలి. మొన్న మూడో విడతలో అక్కడ పోలింగ్ జరగగా... పోలింగ్ ప్రారంభానికి ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఓ స్థానంలో మొత్తం ఆరు మంది అభ్యర్థులు బరిలో ఉంటే... మాక్ పోలింగ్ లో భాగంగా ఒక్కో అభ్యర్థికి 9 ఓట్ల చొప్పున వేయించిన అధికారులు... వాటిని జనం ముందే కౌంట్ చేశారు. ఈ లెక్కన ఆరుగురు అభ్యర్థులకు 9 ఓట్లేసి రావాలి. అయితే అనూహ్యంగా బీజేపీ అభ్యర్థికి ఏకంగా 17 ఓట్లు వచ్చేశాయి. కాంగ్రెస్ కు 9 ఓట్లు రాగా... ఆప్ అభ్యర్థికి 8 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థికి కేవలం ఒక్క ఓటే వచ్చింది. ఈ లెక్కన 9 ఓట్లు మాత్రమే వేస్తే... బీజేపీకి 17 ఓట్లు ఎలా వచ్చాయన్నది అసలు సిసలు ప్రశ్న.అంతేకాకుండా ఆప్ అభ్యర్థికి 9 ఓట్లు వస్తే... 8 ఓట్లే ఎలా కౌంట్ అయ్యాయి? స‌్వతంత్ర అభ్యర్థికి కూడా 9 ఓట్లు వేస్తే... ఏకంగా ఒక్క ఓటు మాత్రమే ఎలా కౌంట్ అయ్యింది. అంటే... ఇతర పార్టీల అభ్యర్థులకు వేస్తున్న ఓట్లలో చాలా భాగం బీజేపీకి పడిపోతున్నాయన్న మాట.. మరి 9 ఓట్లకే ఏకంగా 17 ఓట్లు వస్తే... ఇక వేలు, లక్షల ఓట్లలో బీజేపీ ఎంతమేర ఓట్లను దొంగిలిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్న మాట వినిపిస్తోంది. కేరళలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జనం ప్రశ్నించిన చోట మాత్రమే ఈవీఎంలను మార్చేస్తున్న అధికారులు... చాలా ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండానే ఈ తతంగాన్ని నడిపించేస్తున్నారు. ఈ లెక్కన మరోమారు గెలుపొందేందుకు జనామోదాన్ని కాకుండా ఈవీఎంలను నమ్ముకుని బీజేపీ వ్యూహం రచించుకుందన్న మాట. మరి ఈ కుట్రలకు సుప్రీంకోర్టు ఎలాంటి బ్రేకులేస్తుందో చూడాలి.