మెదక్, ఏప్రిల్ 4 (way2newstv.com):
అధికారుల నిర్లక్ష్యం గ్రామీణుల ప్రాణాలకు ముప్పుగా మారింది. అత్యంత ముఖ్యమైన పనుల విషయంలో సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు. జిల్లాలో 44వ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ప్రధాన రహదారికి అనుసంధాన రోడ్లు నిర్మించాలని అప్పట్లో అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని మనోహరాబాద్ మండలం కాళ్లకల్ నుంచి రామాయంపేట వరకు రహదారులకు ఆనుకొని ఉన్న ప్రతి గ్రామానికి అనుసంధాన రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చొరవతో వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామంలో ఒక చోట మాత్రమే రహదారి నిర్మించారు. ఇదే సమయంలో తూప్రాన్ మండలం రావెల్లి, కరీంగూడ, మనోహరాబాద్ మండలం దండుపల్లి, వెల్దుర్తి మండలం రామంతాపూర్, చేగుంట మండలంలోని వల్లూర్, జప్తిశివనూర్, రామాయంపేట మండలంలోని దామరచెర్వుతో పాటు పలు గ్రామాల వద్ద అనుసంధాన రోడ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మాయ’దారి’ కష్టాలు(మెదక్)
15 ఏళ్ల క్రితం జాతీయ రహదారి నిర్మించిన సమయంలో మాత్రమే కొన్ని గ్రామాలకు అనుసంధాన రోడ్లు నిర్మించారు. అనంతరం ఏ ఒక్క చోట నిర్మించలేదు. వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద రోడ్డు లేకపోవడంతో ఆ గ్రామ ప్రజలు పట్టుబట్టారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ద్వారా జాతీయ రహదారుల శాఖ అధికారులతో చర్చించి నిధులు మంజూరయ్యేలా చొరవ తీసుకున్నారు. ఏడాది కాలం పనులు చేపట్టి మూడు నెలల క్రితమే రహదారి నిర్మాణం పూర్తి చేశారు. గ్రామస్థులంతా ఏకతాటిపై ఉండి రహదారి నిర్మాణానికి కృషి చేయడంతో ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట పడింది.
జాతీయ రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాలు ఇరువైపులా అతివేగంగా రాకపోకలు సాగిస్తుంటాయి. అధిక ప్రాధాన్యం కలిగిన ఈ రహదారిపై అధికారులు అనుసంధాన రోడ్లు నిర్మించాల్సిన విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. రావెల్లి, వెల్దుర్తి మండలం రామంతాపూర్, చేగుంట మండలంలోని వల్లూర్, జప్తిశివనూర్, రామాయంపేట మండలంలోని దామరచెరువు గ్రామాల వద్ద రోడ్లు లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు నేరుగా జాతీయ రహదారిపైకి వచ్చి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ తరుణంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వందలాది మంది క్షతగాత్రులుగా మారుతున్నారు. ఇదే విషయమై పలు గ్రామాల ప్రజలు ప్రజా ప్రతినిధుల ద్వారా జాతీయ రహదారుల సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టిసారించి అనుసంధాన రోడ్లు వెంటనే నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.