ఆదిలాబాద్, ఏప్రిల్ 4 (way2newstv.com):
అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. ఇప్పటికే మంచిర్యాల జిల్లా రంగపేట అటవీ ప్రాంతంలో చిరుత పులి, శివ్వారంలో పెద్దపులిని వేటగాళ్లు హతమార్చిన ఘటనలు మరవకముందే ప్రాణాహితనది సరిహద్దులోని వేమనపల్లి మండలంలో మరో చిరుత బలైంది. అడవుల్లో వేటగాళ్ల కదిలికపై నిఘా పెట్టాల్సిన అధికారులు పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి అమాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపి చేతులు దులుపుకొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పోలీసులు, అటవీ శాఖల మధ్య సమన్వయలోపం వేటగాళ్లకు వరంలా మారింది.
మహారాష్ట్ర కేంద్రంగా స్వచ్ఛంద సేవ సంస్థ ముసుగులో జంతు వేటగాళ్లు ‘టైగర్ హంటింగ్ ఎండ్ సొసైటీ’ పేరుతో అక్రమాలకు పాల్పడుతూ ఇటీవల రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు చెందిన టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు. ఈ విషయం చివరి వరకు అటవీ అధికారులకు తెలియదు. ఈ ఘటన మరవకముందే మరో చిరుత పులి చర్మం పోలీసులు పట్టుకున్నారు.
అడవి తల్లంటే నిర్లక్ష్యమా..? (ఆదిలాబాద్)
అటవీ అధికారులకు దీనిపై సమాచారమే లేదు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రాణహిత నది సరిహద్దులోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన వేమనపల్లి మండలంలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన వేటగాళ్లు ఇక్కడి వేటగాళ్ల సహకారంతో చిరుతపులి చర్మాన్ని మంచిర్యాల జిల్లాకు తరలించే క్రమంలో స్పెషల్ పార్టీ పోలీసులకు చిక్కారు. వారు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. చిరుత చర్మం సహా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ నెలక్రితం మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో పెట్టిన విద్యుత్తు తీగల ఉచ్చుకు ఈ చిరుత బలైనట్టు తెలిసింది. దాని చర్మం, గోర్లు అమ్మి సొమ్ము చేసుకోవడానికి మంచిర్యాల జిల్లాకు దాటిస్తుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నట్టు తెలిసింది.
స్మగ్లర్లు, వేటగాళ్ల నుంచి అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి పోలీసులు, అటవీ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇక్కడ ఆ రెండు శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అడవుల్లో క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన కింది స్థాయి అటవీ అధికారులు పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్నారు. ఇళ్ల నిర్మాణాలకు యజమానులు జీరో కర్ర వాడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన అటవీ శాఖ అధికారులు ఒక దర్వాజకు రూ.2,500, కిటికీకి రూ.1500 అక్రమంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కవ్వాల్ నుంచి శివ్వారం అటవీ ప్రాంతానికి పెద్దపులి వచ్చిన సమాచారం కూడా అటవీ శాఖ తాత్కాలిక ఉద్యోగులే వేటగాళ్లకు సమాచారం ఇచ్చినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసుల విచారణలో తేలింది. అందుకే పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా వేటగాళ్లను పట్టుకుంటున్నారు.
అడవుల్లో వన్యప్రాణులకు విద్యుత్తు తీగల ఉచ్చు పెట్టకుండా అటవీ, విద్యుత్తు, ఎక్సైజ్, పోలీస్ అధికారులతో కమిటీలు వేసినా ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. ఇప్పటికైనా అటవీ, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేటగాళ్లకు ముకుతాడు వేయాల్సిన అవసరం ఉంది.