న్యూఢిల్లీ, ఏప్రిల్ 27, (way2newstv.com)
ప్రచార ప్రధానమంత్రి అంటూ పీఎంపీగా మోడీని ప్రియాంక అభివర్ణిస్తూ ప్రచారం చేస్తున్నారు. పబ్లిసిటీ చేసుకున్న వారందరికీ ప్రయోజనం లభించదు. ఏ సమయంలో ఎలా ప్రచారం చేసుకోవాలి?అందుకు అనుసరించాల్సిన మార్గమేమిటన్నది తెలిసిన వాడే నిజమైన ఫలితాన్ని పొందగలుగుతారు. మన పీఎం ఈవిషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. ప్రభువు ప్రజల మనసులు గెలుచుకోవాలి. అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి. సామ,దాన,భేద, దండోపాయాలను ప్రయోగించి పట్టు బిగించాలి. పవర్ లో కొనసాగాలి. ఇందుకోసం ఏం చేసినా తప్పులేదు. వీటికి తోడు అనేక జంతర్ మంతర్ విద్యలు తెలిసినవారు మన ప్రధాని. ప్రచారం వికటిస్తున్నప్పుడు దానిని తనకు అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట. 2014లో ఆశలహరివిల్లులా ఎక్కడికి వెళ్లినా మోడీకి జేజేలు దక్కుతుండేవి. ఇప్పుడా స్థితి లేదు. కొన్ని చోట్ల సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. మరికొన్ని చోట్ల బలవంతంగా ప్రజలను తరలించాల్సి వస్తోంది.
మోడీ....ఒకే దెబ్బకు రెండు పిట్టలు
ఈ వాస్తవాలను ఆయన గ్రహించారు. గడచిన అయిదు సంవత్సరాలుగా తనను చూస్తున్న ప్రజలకు బోర్ కొడుతోంది. తన సిద్ధాంత రాద్దాంతాలపై ప్రజలకు నమ్మకం తగ్గిపోయింది. చెప్పిందే చెబుతున్నారన్న భావనతో సీరియస్ నెస్ పోయింది. ఒకరకంగా చెప్పాలంటే ఓటర్లు పట్టించుకోవడం మానేస్తున్నారు. మూడు విడతల ఎన్నికలు, ప్రచార సరళిని చూసిన తర్వాత మోడీ దీనిని సరిగ్గా అంచనా వేశారు. అందుకే మరోసారి తనకు కొత్త గుర్తింపు తెచ్చుకునేందుకు ఆఫ్ బీట్ రూట్ లోకి వచ్చారు. సామాన్యమైన తన జీవన విధానం, తన అలవాట్లు, ఇతర పార్టీల నాయకులతో తనకుండే స్నేహపూర్వక సంబంధాలపై చర్చకు తెర తీశారు. పక్కా టైమింగ్ సెట్ చేశారు. ప్రధానితో అక్షయకుమార్ ఇంటర్వ్యూ బయటకు చూస్తే ఆఫ్ బీట్ కథనంగా కనిపిస్తుంది. కానీ లోతైన రాజకీయ లక్ష్యాలు అందులో దాగి ఉన్నాయి. నరేంద్రమోడీ పేరు చెబితే మమత విరుచుకుపడతారు. ఆయన తన రాష్ట్రంలో అడుగుపెట్టడమే ఇష్టం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ప్రధానిని గుర్తించ నిరాకరిస్తున్నట్లుగా కనబడతారు. అయితే మోడీకి, ఆమెకు మధ్య ఆత్మీయసంబంధాలే ఉన్నాయి. వ్యక్తిగతంగా సుహ్రుద్భావాన్నే కలిగి ఉన్నారు. అదే విషయాన్ని తొలిసారిగా మోడీ కుండబద్దలు కొట్టారు. చూసేవారికి ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొత్తవిషయాన్ని చెప్పడం ప్రధాని మోడీ లక్ష్యం కాదు. అదే తన పంథా అయితే ఎప్పుడో బయటపెట్టేసేవారు. టైమింగ్ చాలా ముఖ్యం. ఇది ఎన్నికల సీజన్. మమతా బెనర్జీ అన్ని పార్టీలను కూడగడుతూ మోడీ వ్యతిరేక శిబిరానికి కేంద్రంగా నిలుస్తున్నారు. మోడీని తాను మాత్రమే ఎదుర్కోగలననే సంకేతాలిస్తూ సొంత రాష్ట్రంలో స్వీపింగ్ కు ప్రయత్నిస్తున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనే లక్ష్యంతో మమత తనకు స్వీట్లు పంపుతుంటారని మోడీ వెల్లడించారు. దీంతో విపక్షాల్లో మమతపై అనుమానం నెలకొంటుంది. పశ్చిమబంగలో తృణమూల్ క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. ప్రాణాలకు తెగించి బరిలో పోరాడే కార్యకర్తలు కొంచెం తగ్గితే బీజేపీ బలం పుంజుకుంటుంది. ఈ పాచికను చాలా చాకచక్యంగా ప్రయోగించారు మోడీ. ఇతర పార్టీల్లో మమత దీదీ పై సందేహాలు ముసురుకుంటాయి.గులాం నబీ ఆజాద్ కాంగ్రెసు పార్టీకి రాజ్యసభలో నాయకుడు. పార్టీ కోర్ కమిటీలోని నలుగురైదుగురిలో ఒకరు. అజాద్ తో తనకు మంచి స్నేహం ఉందని మోడీ చెప్పుకొచ్చారు. కలిసి తిరిగేంత సాన్నిహిత్యమని ఉద్ఘాటించారు. గతంలో ఢిల్లీకి వస్తే తామిద్దరం కలిసేవారమనీ వెల్లడించారు. దీంతో ఆజాద్ కు అధిష్ఠానానికి మధ్య కొంత గ్యాప్ ఏర్పడుతుంది. ఆయన ముస్లిం వర్గాల్లో ఒక బలమైన నేత. కాంగ్రెసులోనూ గట్టి పట్టున్న నాయకుడు. ఎన్నికల వంటి కీలక సమయంలో ఈవివరాలు బయటపెట్టడం రాజకీయ ప్రయోజనాలకు ఉద్దేశించినవే. కాంగ్రెసు పార్టీలోనే గందరగోళం నెలకొల్పడమూ లక్ష్యం కావచ్చు. ప్రధానంగా తాను రాజకీయాలకు అతీతంగా ఉంటాననే సందేశాన్ని ప్రజలకు, పార్టీలకు ఇవ్వడమూ ఉద్దేశం కావచ్చు. అంతేకాదు, తనను తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెసు వాదుల భావనల్లోని డొల్లతనాన్ని బయటపెట్టారు. దీనివల్ల సామాన్యునికి అంతా ఆ తాను ముక్కలే అని చెప్పేసినట్లయ్యింది. మోడీని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదని వివిధ వర్గాల్లో సానుకూలతకు ఆస్కారం ఏర్పడుతుంది. కాంగ్రెసు అగ్రనాయకత్వంతో తన సంబంధాలను చాటి చెప్పడంలోని ఆంతర్యమదే.అన్నిటి కంటే ముఖ్యంగా సామాన్య ఓటర్లను పడగొట్టాలనేది ప్రధాన లక్ష్యం. తన సింప్లిసిటీ, తన అలవాట్లను చర్చలోకి తేవడంతో ప్రధాని పదవికి తనను మించిన అర్హుడు లేడనే సంకేతాలు పంపాలనుకున్నారు. తన వంటి సామాన్యుడు ప్రధాని కావడంతో తమను తాము పోల్చి చూసుకొంటారనే సైకాలజీ సూత్రమూ ఇందులో ఇమిడి ఉంది. తన బట్టలు తానే ఉతుక్కునేవాడు. డబ్బులు లేక బూట్లకు చాక్ పీసుతో పాలిష్ చేసుకునేవాడు. పేదరికం కారణంగా కనీసం మామిడి పండ్లు కొనుక్కునే స్థాయి ఉండేది కాదు . ఈ తరహా సూత్రీకరణలన్నీ ఇప్పటికీ 60 శాతం మేరకు ఉన్న మధ్యతరగతిని ఆకట్టుకునేవే. ముఖ్యమంత్రిగా తాను ఆర్జించిన జీతాన్ని ఉద్యోగులకు వదిలేయడం, తాను సైనికుడు లేదా సన్యాసి కావాలనుకోవడం వంటి అంశాలను ప్రజల ముందు ఇంటర్వ్యూ రూపంలో ఉంచారు. ప్రజల కోసమే తప్ప తనకు స్వార్థం లేదనే భావన కల్పించాలనేది ఇందులో నర్మగర్భితంగా దాగిన అంశం. అందరూ తప్పనిసరిగా చూడాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేసే వ్యక్తిగా సెలబ్రిటీ హోదా కలిగిన అక్షయకుమార్ ను ఎంచుకున్నారు. ప్రధాని ఉద్దేశాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. అయితే తన సామాన్య జీవితం గురించి ఒక సామాన్యునితో ఇంటర్వ్యూ చేయించి ఉంటే బాగుండేది కదా అన్న ప్రశ్న తలెత్తుతుంది.