నల్గొండ, ఏప్రిల్ 03 (way2newstv.com):
మిర్చి రైతులకు ఈసారి నష్టాల ఘాటు నషాలానికెక్కింది. ఏటికేడు గతేడాదే నయమనిపిస్తూ జిల్లాలో రెండేళ్లుగా జెమిని వైరస్, ముడుత తెగుళ్లు కర్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఆర్థికంగా ఆదుకుంటుందని ఆశతో వేల ఎకరాల్లో ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంట ఈసారి ఆశించిన దిగుబడిలో పావువంతు చేతికొచ్చే పరిస్థితి లేదు. జిల్లాలోని 23 మండలాల్లో ఈసారి సుమారు 22 వేల ఎకరాల్లో మిరప సాగైంది. ఆది నుంచి అంతుచిక్కని తెగుళ్లతో అష్టకష్టాలు పడుతూ సాగుకు పూనుకున్న రైతులు పంటపై పెట్టిన పెట్టుబడి పైకమన్నా చేతికి వచ్చే పరిస్థితి లేదని లబోదిబోమంటున్నారు. తెగుళ్లతో పాతాళానికి పడిపోయిన దిగుబడులు ఓ పక్క... పండించిన కొద్ది గొప్ప కాయ నాణ్యంగా లేదంటూ మార్కెట్‌లో ధరరాక మరోపక్క కష్టజీవులు కుమిలిపోతున్నారు.
జిల్లాలో ఈసారి మొత్తంగా 22,282 ఎకరాల్లో సాగు చేసిన మిర్చి ద్వారా 89,130 మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తాయని ఉద్యానవన శాఖ, స్పైసీ బోర్డు అధికారులు అంచనాలు వేశారు. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆశించిన దాంట్లో పావువంతు దిగుబడులు చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఆరంభం నుంచి ముడుత, జెమిని వైరస్ తెగుళ్లు పైర్లను పట్టి పీడించడంతో సరిగా ఎదుగుదల లేదు. దీంతో పూత, కాత సరిగా రాలేదు. వచ్చిన పూత రసం పీల్చే పురుగుల ప్రభావానికి లోనై ముడుచుకుపోయి వంకర టింకరగా కాయలు వచ్చాయి. తెగుళ్లతో కాసిన కాయలు ఆశించినమేర సైజు రాక నాణ్యత తగ్గింది. ఈ పరిస్థితుల్లో మూడేసి మార్లు కోతలు కోయాల్సిన మిరప పంట ఒక్క కోతతో వదిలేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో దాదాపు ఇప్పటికే సాగైన సగం విస్తీర్ణంలో కాసిన కొద్దిగొప్ప కాయలను కోసి తోటలను వదిలేశామని రైతులు ఆవేదనగా చెపుతున్నారు. ఎకరాకు బోర్లు, బావుల కింద సాగు చేసిన పైర్లలో సుమారు 30 క్వింటాళ్ల దిగుబడి ఆశించిన కర్షకులకు అందులో మూడోవంతు అంటే పది క్వింటాళ్ల దిగుబడి చేతికి రావడంలేదని ఘొల్లుమంటున్నారు. మోతె, నూతనకల్, చివ్వెంల, పెన్‌పహాడ్ తదితర మండలాల్లో ఎకరాకు ఐదు నుంచి ఏడు క్వింటాళ్ల దిగుబడే చేతికొచ్చిందని రైతులు వాపోతున్నారు.
నష్టాలఘాటు (నల్గొండ)
జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో గతేడాది ఆగస్టు - సెప్టెంబరు మాసాల్లో బావులు, బోర్ల కింద కొన్ని మండలాల్లో సాగర్ జలాలతో మిరప సాగు చేశారు. అత్యధికంగా చింతలపాలెం, మేళ్లచెర్వు, మఠంపల్లి, చివ్వెంల, తుంగతుర్తి, నూతనకల్, పెన్‌పహాడ్, మోతె మండలాల్లో ఈ వాణిజ్య పంట సాగైంది. ప్రధానంగా ఆయకట్టేతర ప్రాంతాల్లో పండించే మిర్చికి రైతులు తమ ఇతర పంటల మీద వచ్చే ఆదాయాన్ని పెట్టుబడిగా మళ్లిస్తారు. దాదాపు ఆరునెలల పాటు సాగులో ఉండే ఈ పంట చివరలో భారీ ఆదాయాన్నిస్తుందని రైతులు ఆశిస్తారు. కాని ఈసారి వాతావరణంతో పాటు విత్తనంలో జన్యువు పటిష్ఠత తగ్గడం, విచ్చలవిడి బయో మందుల వాడకం వల్ల తెగుళ్లు పైర్లను పట్టి పీడించాయి. పైరుకు పట్టిన చీడపీడలను తగ్గించేందుకు ఎకరాకు రూ.45వేలపైనే పురుగు మందుల కోసం పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. ఎరువులు, కూలీల ఖర్చులు కలుపుకుని మొత్తంగా ఎకరాకు రూ.65 వేల దాకా వెచ్చించాల్సిన పరిస్థితిని రైతులు చవిచూశారు.
తెగుళ్లతో పైర్లు ఏపుగా ఎదగక కాసిన కాయ నాణ్యత లేకుండా పోయింది. దీంతో మార్కెట్‌లో కొనుగోలుదారులు సరుకును అడ్డికిపావుసేరు చొప్పున ధర పెడుతున్నారు. తెగుళ్ల వల్ల తేజరకం మిర్చిలో నూనె శాతం తగ్గుతుందనే వంకలు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. దీనికితోడు కాయ నాణ్యతలేక బరువు తూగడం లేదు. ఈ మిర్చికి మార్కెట్లో క్వింటాలుకు రూ.6500 నుంచి రూ.8500 వరకు ధర పలుకుతోంది. అంటే ఎకరాలో పండించిన ఏడు క్వింటాళ్ల కాయకు కమీషన్ ఖర్చులు పోను రూ.50వేలు చేతికి వస్తున్నాయి. ఒక్కో ఎకరాకు తను పడిన కష్టంకాక రూ.65వేలదాకా పెట్టుబడి పెట్టిన రైతుకు అసలుకే రూ.15వేలు నష్టం చవిచూస్తున్నారు.