ఉస్మానియాకు ఆర్ధిక కష్టాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉస్మానియాకు ఆర్ధిక కష్టాలు

హైద్రాబాద్, ఏప్రిల్ 12 (way2newstv.com)
ఉస్మానియా విశ్వవిద్యాలయంకు ఆర్దిక కష్టాలు మొదలయ్యాయి. ఉద్యోగులకు నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వలేని ఆర్థిక కష్టాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం అవస్దలు పడుతోంది.  కొన్ని నెలలుగా వేతనాలు సకాలంలో ఇవ్వలేని దుస్థితిని ఎదుర్కొంటోంది. పదవీ విరమణ పొందిన వారికి సంబంధిత ప్రయోజనాలు ఇవ్వడంలోను తీవ్ర జాప్యం జరుగుతోంది.వీటి పరిస్థితే ఇలా ఉంటే.. విద్యార్థులకు అత్యవసరమైన వసతిగృహాలు, వాటిల్లో సౌకర్యాల గురించి పట్టించుకునే పరిస్థితి ఉండట్లేదు. యూనివర్సిటీ ఏడాది మొత్తం ఆదాయంలో ఉద్యోగుల వేతనాలకు సుమారు రూ.284.55 కోట్లు, పెన్షనర్లకు  రూ.200.80 కోట్లు వెచ్చిస్తోంది. ఈ రెండింటికి మొత్తం రూ.485.35 నిధులు అవసరం అవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ గ్రాంట్ రూపంలో రూ.309.54 కోట్లు మాత్రమే ఇస్తోంది.ఈ లోటు పూడ్చుకునేందుకు ఓయూ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. 
 

ఉస్మానియాకు ఆర్ధిక కష్టాలు

పరీక్షల విభాగం, విదేశీ సంబంధాలు, దూర విద్య, అడ్మిషన్లు విభాగాల నుంచి సమకూరుతున్న ఆదాయమే ఉస్మానియా ఆర్థిక కష్టాలను కొంత వరకు తీరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎటువంటి నిధులు రాకపోవడంతో కొత్త పనుల ప్రతిపాదనలు అటకెక్కాయి.కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులు ఇప్పటికీ అదే విధానంలో కొనసాగుతున్నాయి. దీంతో ఇవి విద్యార్థులపై అత్యంత ఆర్థికభారం వేస్తున్నాయి. ఈ కోర్సులను రెగ్యులర్ విధానంలోకి తీసుకొస్తే వచ్చే ఆదాయం తగ్గిపోతుందనే కోణంలో వర్సిటీ అధికారులు చూస్తున్నారు. నిరుపేద, మధ్య తరగతి విద్యార్థులు ఈ కోర్సులకు ఆమడ దూరంలోనే ఉండిపోతున్నారు. వర్సిటీ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి ఆర్థిక ఇబ్బందే ప్రధాన కారణంగా ఉంటోంది.ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన సందర్భాలు గత కొన్నేళ్లలో లేవు. ప్రతినెలా ఏదో ఒక కారణంగా జాప్యం జరుగుతూనే ఉందని పలువురు వివరిస్తున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యావసరాలు తదితర ఖర్చులకు తరచూ తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఉద్యోగులు తెలిపారు.వేతనాల కోసం సమ్మెలు చేయాల్సిన పరిస్థితి ఉంటోందని వారు వాపోతున్నారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో నిరసన తెలియజేస్తే.. ఎట్టకేలకు 4వ తేదీన వేతనాలు విడుదల చేశారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రాలేదనే కారణాన్ని చూపిస్తూ ప్రతి నెల తాత్సారం చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.