వేగంగా ప్రక్షాళన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వేగంగా ప్రక్షాళన

హైదరాబాద్‌, ఏప్రిల్ 26  (way2newstv.com): 
కాలుష్య కాసారాలుగా మారిన చెరువులు, కుంటల ప్రక్షాళనకు హెచ్‌ఎండీఏ నడుం బిగించింది. హుస్సేన్‌సాగర్‌ మాదిరిగానే నీటి వనరుల్లో పేరుకపోయిన గుర్రపు డెక్కను తొలగించేందుకు ముంబయి నుంచి తెప్పించిన అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్లు(ఎఫ్‌టీసీ) యంత్రాలను రంగంలోకి దించింది. దశలవారీగా ముఖ్యమైన చెరువుల్లో గుర్రపు డెక్క పని పట్టేలా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే రెండు చెరువుల్లో తొలగింపు ప్రక్రియను షురూ చేసింది. మరో రెండు చెరువుల్లో పనులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
అన్ని చెరువుల్లోనూ గుర్రపు డెక్క ప్రధాన సమస్యగా మారింది. 2016 నుంచి హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనలో ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్లను(ఎఫ్‌టీసీ) వినియోగిస్తున్నారు. అక్కడ సత్ఫలితాలనిస్తుండటంతో ఈ చెరువుల్లోనూ గుర్రపు డెక్కను తొలగించేందుకు వాటినే వినియోగించాలని నిర్ణయించారు. సుమారు రూ.3 కోట్లతో ముంబయి నుంచి రెండు యంత్రాలను తెప్పించారు. ఈ యంత్రాలతో తక్కువ సమయంలో ఎక్కువ పని జరుగుతుంది. 12 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు వరకు ఒకేసారి గుర్రపు డెక్కను తొలగిస్తుంది. తొలగించిన దాన్ని ట్రాష్‌ కలెక్టర్‌లో వేయొచ్చు. దాని సామర్థ్యం 5 టన్నుల వరకుంటుంది. తేలిగ్గా ముందుకు వెనుకకు పోగలదు. నిర్వహణ బాధ్యతను ఓ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారు.


వేగంగా ప్రక్షాళన 

ఈ రెండు యంత్రాలతో రెండు నెలల్లో నాలుగు చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించాలని హెచ్‌ఎండీఏ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ముందుగా రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం జిల్లెలగూడ చెరువు, మేడ్చల్‌ - మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలంలోని రాంపల్లి చెరువులో ఇటీవల పనులు షురూ చేశారు. త్వరలోనే ఆ రెండు చెరువుల్లోనూ తొలగింపు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత నాగారంలోని అన్నరాయుని చెరువు, మీర్‌పేట్‌లోని మంత్రాల చెరువులో తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అక్కడ తొలగింపు పూర్తి కాగానే మరో నాలుగు చెరువులను ఎంపిక చేస్తామని వివరిస్తున్నారు.హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో 3132 చెరువులు, కుంటలున్నాయి. నగర శివారుల్లోని అధికశాతం చెరువుల వైపు వెళ్లాలంటేనే ముక్కు మూసుకోవాల్సిన  దుస్థితి ఏర్పడిదంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ చెరువు.. ఈ కుంట అని తేడా లేకుండా అన్ని నీటి వనరులు మినీ డంపింగ్‌ యార్డులుగా మారాయి. గుర్రపు డెక్క పేరుకపోయింది. మురుగు, పారిశ్రామిక, ప్రమాదకర రసాయన వ్యర్థాలను యథేచ్ఛగా వాటిలోకి వదిలేస్తున్నారు. జంతు కళేబరాలు, చెత్త, చెదారం, ఆసుపత్రుల నుంచి వెలువడే బయో మెడికల్‌ వేస్ట్‌ ను జల వనరుల్లో కలిపేస్తున్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకొని కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుండటంతో హెచ్‌ఎండీఏ అధికారులు అప్రమత్తమై చెరువులు, కుంటలను ఎంపిక చేసి వాటి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.