నిజామాబాద్, ఏప్రిల్ 26 (way2newstv.com):
వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం 64 ఏళ్లు కలిగిన వారికి రూ. వేయి పింఛన్ అందిస్తోంది. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే పింఛన్ల అర్హతను 57 ఏళ్లకు కుదించింది. వీరికి రూ. 2 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డబ్బులు కూడా ఏప్రిల్ నుంచే అందించాలని భావించింది. కానీ, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మరింత జాప్యం నెలకొంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే అందజేస్తారు. అయితే నిజామాబాద్ జిల్లాలో 57 ఏళ్లు నిండిన లబ్ధిదారుల జాబితా ఇంకా తయారు చేయలేదు. కామారెడ్డి జిల్లాలో లబ్ధిదారుల ప్రాథమిక అంచనా పూర్తిచేశారు. అయితే ఆసరా పింఛను మంజూరు చేయకపోవడంతో లబ్ధిదారులు నిరాశలో ఉన్నారు.వృద్ధాప్య పింఛను పొందాలంటే 64 ఏళ్లు ఉండాలి. అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు చాలా మంది మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తు చేసుకున్నా అర్హత వయస్సు లేదని తిరస్కరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య తలెత్తింది. ఆసరా పింఛను వయస్సును 57 ఏళ్లకు కుదిస్తామని తెరాస తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పింది. ఈ ఏడాది జనవరి నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఏప్రిల్ నుంచి పింఛను వస్తుందని భావిస్తుండగా లోక్‌సభ ఎన్నికల కోడ్ అడ్డొచ్చొంది.
ఆసరా మరింత ఆలస్యం (నిజామాబాద్)
57 ఏళ్లు నిండిన లబ్ధిదారులను ఓటర్ల జాబితా ప్రకారం ఎంపిక చేయాలని మొదట ఆదేశించారు. డీఆర్‌డీఏ అధికారులు ఓటర్ల జాబితా ప్రకారం లబ్ధిదారుల ఎంపిక పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్ల జాబితాలో పలుమార్లు మార్పులు చేర్పులు చేయడంతో ఎంపిక కష్టంగా మారింది. ఓటర్ల జాబితా కాకుండా గ్రామ సభలను ఏర్పాటు చేసి ఎంపిక చేయాలని మరోసారి ఆదేశాలొచ్చాయి. ఓటర్ల జాబితా ప్రకారం ఎంపిక చేసిన వారి పేర్లను గ్రామ సభలో వినిపించాలని అధికారులు చూశారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు పక్కాగా లేకపోవడంతో అధికారులు ఏం చేయలేక మిన్నుకుండిపోయారు. నిజామాబాద్ జిల్లాలో 57 ఏళ్ల వయస్సు వారు 91 వేల మంది ఉన్నట్లు సమాచారం. అందులో తప్పలు దొర్లడంతో మరోసారి ఎంపిక చేసేందుకు చూడగా అంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.కొత్తగా ఇచ్చే ఆసరా పింఛను విషయంలో ప్రభుత్వం సరైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. 57 ఏళ్లు నిండిన వారికి పింఛను ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో నిత్యం ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాలకు పదుల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. మార్గదర్శకాలు రాకున్నా దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇప్పటికే లక్ష వరకు దరఖాస్తులొచ్చాయి. ఎంపీడీవోలకు, కమిషనర్లకు దీనిపై సరైన ఆదేశాలు లేవు. దరఖాస్తులు తీసుకోవద్దని ఉన్నా.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు.ఏప్రిల్‌లో కొత్త పింఛను వస్తాయని అందరూ భావించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఈ కోడ్ మే 25 వరకు ఉంటుంది. ఆ తర్వాత లబ్ధిదారుల జాబితా తయారుచేసి జూన్ నెలలో 57 ఏళ్ల వారికి ఆసరా పింఛను మంజూరు చేయొచ్చు. మున్సిపల్ ఎన్నికలొస్తే మాత్రం ఈ ప్రక్రియ నిలిచిపోతుంది. జులై ఆఖరు, ఆగస్టు మొదటి వారంలో కొత్త పింఛన్లు ఇచ్చే ఆస్కారం ఉంది.