ఐదు రాష్ట్రాల్లో 23 టెన్షన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఐదు రాష్ట్రాల్లో 23 టెన్షన్

న్యూఢిల్లీ, మే 22 (way2newstv.com): 
మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఒకింత టెన్షన్ కనిపిస్తోంది. ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించడంతో.. బొటాబొటి మెజార్టీతో నెట్టుకొస్తున్న ప్రభుత్వాలు టెన్షన్ పడుతున్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గోవా, మణిపూర్‌ అసెంబ్లీలపై అందరి చూపు పడుతోంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. కమల్‌నాథ్ సర్కారుకి మెజార్టీ లేదని బీజేపీ ఆరోపించింది. దీంతో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మెజార్టీ నిరూపించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌కు 114 మంది సభ్యులున్నారు. నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీకి 109 మంది సభ్యుల బలం ఉంది. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని మాయావతి బెదిరింపులకు దిగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత అక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తమిళనాట 38 లోక్ సభ స్థానాలతోపాటు 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల్ని నిర్వహించారు. 
ఐదు రాష్ట్రాల్లో 23 టెన్షన్

జయలలిత మరణంతో అన్నాడీఎంకేకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు తోక జాడించడంతో.. వారిపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉండగా.. అన్నాడీఎంకేకి 113 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకేకి 97 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సాధారణ మెజార్టీకి అన్నాడీఎంకేకి నలుగురు ఎమ్మెల్యేలు అవసరం కాగా.. డీఎంకేకి 21 సీట్లు అవసరం. అధికార పార్టీపై అసంతృప్తి ఎక్కువగా ఉండటంతో తమిళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇక కర్ణాటక సంకీర్ణ సర్కారు గురించి తెలిసిందే. పడుతూ లేస్తూ సాగిన జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారమే ఏడాది పూర్తి చేసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో ఈ కూటమికి తక్కువ సీట్లొస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కుమారస్వామి సర్కారు కూలిపోతుందని బీజేపీ నేతలు ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించారు. అంతే కాకుండా అక్కడి కాంగ్రెస్ నేతల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. దీంతో ఎన్నికల తర్వాత కన్నడనాట రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా ఉందిగోవాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలు మే 23న వెల్లడి కానున్నాయి. గోవా అసెంబ్లీలో 36 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌కు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ మిత్ర పక్షాల అండతో నెట్టుకొస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రాకపోతే.. ప్రభుత్వ మనుగడ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మణిపూర్ అసెంబ్లీలో 60 స్థానాలు ఉండగా.. 2017 ఎన్నికల తర్వాత 28 స్థానాలతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు గోడ దూకారు. మిత్రపక్షాల సాయంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికలు పూర్తయ్యాక బీజేపీ ప్రభుత్వం నుంచి వైదొలుగుతామని మణిపూర్‌కు చెందిన నాగా పీపుల్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఆ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.