నిన్నటి వరకూ నలభై ఏళ్ల అనుభవమున్న రాజకీయ నేత అని ఉప్పొంగిపోయిన నారా చంద్రబాబునాయుడు ఫలితాలను చూసి డీలా పడ్టారు. ఓటమి పై విశ్లేషణ చేసేందుకు కూడా ఎలాంటి కారణాలు దొరకలేదు. హేమాహేమీలు సయితం ఓటమి పాలయ్యారు. గట్టి అభ్యర్థులనుకున్న వారంతా వరసబెట్టి పరాజయం బాట పట్టారు. ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలను చంద్రబాబు నాయుడు పెద్దగా కలవడానికి ఇష్టపడటం లేదు. కొందరు ఎంపిక చేసిన నేతలనే ఆయన తన నివాసంలో కలుస్తున్నట్లు తెలుస్తోంది.
40 ఇయర్స్ ఇండస్ట్రీ....ఎందుకిలా
అయితే ఈసందర్భంగా చంద్రాబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను బస్సులో కూర్చుని పాలన చేసినా, హుద్ హుద్ తుఫాను సమయంలో అక్కడి ప్రజలకు అండగా నిలిచినా ఎందుకు పట్టించుకోలేదని ఆయన మనోవేదన చెందుతున్నట్లు సమాచారం. తాను పడిన కష్టాన్ని ప్రజలు గుర్తించలేదా? లేక జగన్ ను బలంగా నమ్మబట్టే మనం ఇంత ఘోరంగా ఓటమిపాలయ్యమా? అన్న ప్రశ్నలను ఆయన సీనియర్ నేతల వద్ద వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద క్షేత్రస్థాయిలో నాయకులు ప్రజాసమస్యలపై కన్నా సొంతలాభం ఈ ఐదేళ్లు చూసుకోవడం వల్లనే ఓటమి పాలయ్యామని, వారి మీద ఉన్న వ్యతిరేకతతో ప్రజలు తమను దూరం పెట్టారని ఒక నిర్ణయానికి వచ్చారు.