కాసుల గలగల (చిత్తూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాసుల గలగల (చిత్తూరు)

చిత్తూరు, మే 27 (way2newstv.com): 
పల్లె పాలనకు పైసలు అందనున్నాయి.. కొద్దికాలంగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న గ్రామ పంచాయతీలకు కాసింత వెసులు బాటు లభించింది.. ప్రభుత్వ ఆంక్షలతో కొన్ని నెలలుగా పంచాయతీ ఖాతాల్లో నిధులున్నా అత్యవసర ఖర్చులకూ వినియోగించే అవకాశం లేక పల్లె పాలన కుంటుపడింది.. ఆర్థిక సంఘ నిధులనూ డ్రా చేసుకునే వీలులేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి.. ఖాతాల్లో రూ.కోట్ల నిధులు ఉన్నా గత నెల రోజులుగా అన్ని పంచాయతీల ఖాతాల్లో జీరో నిల్వ చూపుతుండటంతో పంచాయతీ అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.. తాజాగా ఆంక్షల సడలింపుతో పంచాయతీల ఖాతాల్లోకి నిధుల నిల్వ చేరింది.. ఆర్థిక సంవత్సరం ముగిసే సందర్భంలో కొద్దిరోజుల పాటు అన్ని రకాల ప్రభుత్వ చెల్లింపులపై ఆంక్షలు కొనసాగుతాయి. పంచాయతీలకు సంబంధించిన అన్ని నిధులు గతంలో ఖజానాలో ఉండేవి. ఏవైనా ఆంక్షలుంటే ఖజానా స్థాయిలోనే నిధులు చెల్లించకుండా నిలిపివేసేవారు. ఇటీవల ప్రభుత్వం సమీకృత ఆర్థిక విధానం(సీఎఫ్‌ఎంఎస్‌) అమలు చేశాక పరిస్థితి మారింది. ఈ విధానంలో ప్రభుత్వ పరమైన అన్ని ఆర్థిక లావాదేవీలు ప్రభుత్వ కనుసన్నల్లోనే సాగేవి. ఖజానా స్థాయిలో బిల్లులు పాస్‌ చేసినా ఏరోజుకారోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. 

కాసుల గలగల (చిత్తూరు)
రూ.వేల కోట్లతో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను అధిగమించే క్రమంలో స్థానిక సంస్థల బిల్లుల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఫలితంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి పంచాయతీలకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. సాధారణ నిధులతో పాటు ఆర్థిక సంఘ నిధులనూ డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోయింది. 14వ ఆర్థిక సంఘ నిధులతో పాటు ఇంటి పన్నులు, ఇతర ఆదాయ మార్గాల రూపేణా వసూలు చేసిన నిధులు మొత్తం కలిపి రూ.120 కోట్లు వరకూ జిల్లాలోని పంచాయతీల ఖాతాల్లో ఉన్నా ఆంక్షల కారణంగా కనీస ఖర్చులకూ నిధులు కరవయ్యాయి. గతేడాది జులై నెలాఖరుకు పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన అందుబాటులోకొచ్చింది. గ్రామీణ పాలన బాధ్యత పూర్తిగా పంచాయతీ కార్యదర్శులపై పడింది. నెలల తరబడి నిధులపై ఆంక్షలు ఉండటంతో తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ప్రధాన అవసరాలకు నిధుల్లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కొత్త ఆర్థిక సంవత్సం ప్రారంభమై నెలన్నర పూర్తయినా నిధుల విడుదల విషయంలో ఎలాంటి సమాచారం లేకపోవడంతో కార్యదర్శులు ఆందోళనకు గురయ్యారు.నిధులపై అప్పుడప్పుడూ ఆంక్షలు విధించడం పరిపాటే. అయినా గతంలో ఎన్నడూలేని విధంగా పంచాయతీ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌ చూపడం కలవరానికి కారణమైంది. జిల్లాలోని 1372 పంచాయతీల సాధారణ, ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.120 కోట్లకు పైబడి ఉన్నాయి. కొన్ని వారాలుగా అన్ని పంచాయతీల ఖాతాలు జీరో బ్యాలెన్స్‌ చూపుతున్నాయి. పంచాయతీ నిధులను ప్రభుత్వం ఇతర అవసరల కోసం వినియోగించడం వల్లే ఈపరిస్థితి తలెత్తిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం పంచాయతీ ఖాతాల్లో మళ్లీ జమవుతుందా? లేదా? అనే విషయం లోనూ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టిన కార్యదర్శులు గందరగోళానికి గురయ్యారు. వేసవి తాగునీటి అవసరాలు, విద్యుత్‌ బిల్లులు, ఇతరత్రా ప్రాధాన్యతా ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పండింది. ఎప్పుడు ఏ అత్యవసర ఖర్చు ముంచుకొస్తే ఏం చేయాలన్న భయంతో కార్యదర్శులు ఉన్నారు.పంచాయతీ ఖతాలు జీరో బ్యాలెన్స్‌తో ఉండటం, ఈ విషయమై జిల్లా స్థాయి అధికారుల చెంత ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళనలో ఉన్న కార్యదర్శులకు ఊరట లభించింది. ఎట్టకేలకు ఆర్థిక సంఘం నిధులు ఖతాల్లోకి జమ చేశారు. సాధారణ నిధులకూ మార్గం సుగమం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో పంచాయతీల ఆర్థిక ఇబ్బందులకు మోక్షం లభించనుంది.