టార్డెట్ టీడీపీగా జగన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టార్డెట్ టీడీపీగా జగన్


విజయవాడ, మే 31 (way2newstv.com)
ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్ తన ప్రసంగంలో ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు, అవి అమలైన తీరు, తాను అమలు చేయబోయే పథకాలతో పోల్చే ప్రయత్నం చేశారు. టీడీపీలా వందల హామీలు ఇవ్వబోనని, కేవలం రెండు పేజీల మ్యానిఫెస్టో మాత్రమే ఇచ్చానని గుర్తు చేసిన జగన్.. దాన్ని అమలు చేసి తీరుతానని స్పష్టం చేశారు.తన సుదీర్ఘ పాదయాత్రలో టీడీపీ ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన వైసీపీ అధినేత జగన్.. ముఖ్యమంత్రి పదవి చేపట్టే సందర్భంలోనూ టీడీపీని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రమాణ స్వీకార వేదిక విషయంలోనే తక్కువ ఖర్చుపెట్టాలని అధికారులకు సూచించిన జగన్... గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టిన విషయాన్ని వారికి గుర్తుచేశారు. దీంతో అధికారులు కూడా ప్రభుత్వ స్టేడియంలోనే ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని తక్కువ ఖర్చుతోనే నిర్వహించారు. తద్వారా టీడీపీ ప్రభుత్వానికీ తనకూ ఉన్న తేడా ఏంటో చూపించే ప్రయత్నం చేశారు.


టార్డెట్ టీడీపీగా జగన్
సీఎంగా ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన తర్వాత చేసిన ప్రసంగంలోనూ జగన్ టీడీపీ టార్గెట్ గా వాగ్బాణాలు సంధించారు. ముఖ్యంగా మ్యానిఫెస్టో విషయంలో టీడీపీ తప్పిదాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తాము మ్యానిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావిస్తానని, అలవికాని రీతిలో వందల హామీలు ఇచ్చి టీడీపీ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదని జగన్ గుర్తు చేశారు. తాను అలా చేయబోనని, కేవలం రెండు పేజీల్లోనే మ్యానిఫెస్టో ఇచ్చామని, అందులో ప్రతీ పదాన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. తద్వారా మ్యానిఫెస్టోకు తాను ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో చెప్పకనే చెప్పారు.పింఛన్ల విషయంలోనూ గత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, తాను మాత్రం పింఛన్లను ఏటా పెంచుకుంటూ వెళ్లి మూడేళ్లలో మూడు వేల రూపాయలు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు. అలాగే టీడీపీ అనుకూల మీడియాను సైతం జగన్ టార్గెట్ చేశారు. టీడీపీ అనుకూల మీడియాకు చంద్రబాబు మాత్రమే సీఎంగా కనిపిస్తారని, వేరెవరు ఆ పదవిలో ఉన్నా వారిని దింపేందుకు కుట్రలు చేస్తారన్నారు. అందుకే తాను జ్యుడిషియల్ కమిషన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు జగన్ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ నిర్ణయాలను జ్యుడిషియల్ కమిషన్ కు నివేదిస్తామని, న్యాయమూర్తి అనుమతితోనే నిర్ణయాలు అమలు చేస్తామన్నారు. అప్పటికీ తప్పుడు రాతలు రాస్తే సదరు మీడియా సంస్ధలపై పరువు నష్టం దావాలు వేస్తామన్నారు.టీడీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని, జన్మభూమి కమిటీలు దోచుకుతిన్నాయని, కానీ తన పాలనలో గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా అవినీతి లేకుండా చూస్తామన్నారు. ఉద్యోగులు, వాలంటీర్లు ప్రభుత్వ పథకాలలో కక్కుర్తి పడకుండా వారికి తగిన పారితోషికాలు అందజేస్తామన్నారు జగన్. గత ప్రభుత్వ పాలనలో అవినీతి మితిమీరిందని, అందుకే రివర్స్ టెండరింగ్ విధానంలో టీడీపీ హయాంలో ఇచ్చిన టెండర్లను రద్దు చేసి వాటి స్ధానంలో సాధ్యమైనంత తక్కువగా కోట్ చేసే వారికే పనులు అప్పగిస్తామన్నారు. తద్వారా మిగిలిన 15 శాతం లేదా 20 శాతం మొత్తాన్ని వివిధ సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంత మేర డబ్బు మిగిలిందన్న విషయాన్ని కూడా ప్రజలకు బహిరంగంగా వెల్లడిస్తామన్నారు.