వైసీపీలో పోర్టు ఫోలియోల గొడవ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైసీపీలో పోర్టు ఫోలియోల గొడవ

క్లాస్ పీకిన జగన్ 
హైద్రాబాద్, మే 5, (way2newstv.com)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లే భావిస్తోంది. కొందరు వైసీపీ నేతలు తీరు చూస్తుంటే తాము అధికారంలోకి రావడం ఖాయమని భావించి ముందుగానే మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మంత్రి పదవులే కాదు కొందరు ఏకంగా పోర్టుఫోలియోలను కూడా తామే ఛూజ్ చేసుకుంటున్నారంటే దీన్ని అత్యుత్సాహం అనాలా? లేక వేలం వెర్రి అనాలో తెలియడం లేదు. వైసీపీ నేతలు కొందరు ఫలితాలు రాకముందే ఊహల్లో ఎగురుతున్నారు. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నప్పటికీ అప్పుడే పంఖా పార్టీ నేతలు తొందరపడి పోతున్నారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ప్రధానంగా అధికార తెలుగుదేశ పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు జరిగింది. నువ్వా? నేనా? అన్నట్లు జరిగిన ఈ పోరులో అధికారంపై వైసీపీ కొంత నమ్మకంగా ఉంది. 


 వైసీపీలో  పోర్టు ఫోలియోల గొడవ

పోలింగ్ అనంతరం జరిగిన విశ్లేషణలు కాని, వివిధ సంస్థలు జరిపిన సర్వేలు కాని వైసీపీకే అధికారం వస్తుందని బలంగా చెబుతున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా అంతే ఆత్మవిశ్వాసంతో ఉంది. తాము తిరిగి అధికారంలోకి వస్తామని చంద్రబాబు సయితం పదే పదే చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పార్టీకి 120 సీట్లు వస్తాయని ఖచ్చితంగా చెబుతున్నారు. దీంతో జగన్ కేబినెట్ లో తమకు బెర్త్ ఖాయమంటూ కొందరు ప్రచారం చేసుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత తనకు కీలకమైన రెవెన్యూ శాఖ అని చెబుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక నేత అనుచరులయితే తమ నేత తిరిగి ఆర్థిక శాఖ మంత్రి కాబోతున్నారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన ఒకనేత అయితే అప్పుడే హోం మంత్రిగా ఫీలవుతున్నారట. ఇలా అనేక మంది నేతలు తాము మంత్రి వర్గంలో చేరబోతున్నట్లు, ఏ పోర్టిఫోలియో వస్తుందని కూడా బయటకు చెబుతుండటం పార్టీ నేతలనే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.ముఖ్యంగా ఈ రకమైన ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. అయితే ఈ విషయం తెలిసిన జగన్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న తమ నేతలను పిలిపించుకుని క్లాస్ పీకుతున్నారట. ఇలా ప్రచారం చేసుకోవడమేంటని కొందరినేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారట. దీనికి వారు నీళ్లు నములుతూ.. తమకు తెలియకుండానే అనుచరులు చేశారని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా పార్టీకి డ్యామేజీ అని గ్రహించిన జగన్ అభ్యర్థులందరితో త్వరలోనే సమావేశమయి పోలింగ్ రివ్యూతో పాటు, ఈ ప్రచారంపై కూడా చర్చించాలని నిర్ణయించారట. మొత్తం మీద వైసీపీ నేతల అత్యుత్సాహం ఆ పార్టీని డ్యామేజీ చేస్తుందన్నది వాస్తవం