మహబూబ్ నగర్, మే 27 (way2newstv.com):
కృష్ణానది పరీవాహకంలో వరద జలాలను పూర్తిగా వినియోగించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలో వీలైనంతమేర ఆయకట్టుకు సాగునీటిని ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా ఎత్తిపోతల పథకాల నిర్మాణం మరీ ఆలస్యం అవుతుండటంతో అంచనావ్యయం ఏటేటా భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఆయకట్టుకు నీరందిస్తున్న ప్రాజెక్టుల్లోనూ చాలా ఏళ్లుగా కొనసాగుతున్న నిర్వహణ లోపాలు ఒకదానికొకటి తోడై ఆయకట్టు ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు కింద వరద జలాల పూర్తిస్థాయి వినియోగం అన్నది నేటికీ అందనిద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. కృష్ణానది పరీవాహకంలో కొత్త ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్న ప్రభుత్వం వరద జలాలను పూర్తిగా వినియోగించుకోవడంలో మాత్రం తడబాటు వీడటం లేదన్నది సాగునీటి రంగ నిపుణులు అంటున్న మాట. 7.50 లక్షల ఎకరాల సాగు ఆయకట్టు ప్రయోజనాలతో పుష్కరకాలం కిందట చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిలసాగర్ పథకాలు ఇప్పటికీ పూర్తికాక అంచనాలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి.
నత్తకే నడకలు (మహబూబ్ నగర్)
* జూరాల ప్రాజెక్టు జాతికి అంకితమై పాతికేళ్లు గడిచినా.. ఈ ప్రాజెక్టు పరిధిలో కాల్వల నిర్వహణ అన్నది ఎండమావిగానే మారింది. ఏటా ప్రతిపాదనలు చేయటం.. వాటికి కాడా కొర్రీలు పెట్టటం.. వచ్చిన అరకొర నిధులతో నామ్‌కేవాస్తేగా పనులు ముగించటం అలవాటుగా మారింది. ఫలితంగా.. కాల్వలు పూడుకుపోయి రబీలో చివరి ఆయకట్టు వరకు నీరందకపోవటం.. ఖరీఫ్‌లో నీటివృథా ప్రధాన సమస్యలుగా మారాయి. తొలుత 11.94 టీఎంసీల నీటిసామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టును పూడిక కారణంగా 9.657 టీఎంసీలకు కుదించాల్సిన దుస్థితి వచ్చింది. నెట్టెంపాడుదీ ఇదే బాట. గత నాలుగేళ్లుగా కేవలం చెరువులు నింపి వాటి కిందే ఆయకట్టును చూపిస్తూ కాలం వెళ్ల దీస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చాక.. ఆర్డీఎస్ కింద 87 వేల ఎకరాలకు నీరందక తుమ్మిళ్ల ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. మొదటిదశ మాత్రం పూర్తయినా ఇంకా జలాశయాల నిర్మాణం కాలేదు. ఇపుడు కాల్వల ఎత్తు పెంచేందుకు మరోమారు రూ.77 కోట్లతో తాజా ప్రతిపాదనలు చేశారు. పాలమూరుకు అధికారికంగా కేటాయించిన నికరజలాలే పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు. వరద జలాల వినియోగం కూడా తక్కువగానే ఉంది. గతంలోనూ వరద జలాల ఎత్తిపోత కోసం అనేక సూచనలు చేసినా పట్టించుకోలేదు. కేవలం 30 రోజుల్లో వరద జలాలు ఎత్తిపోసుకునే విధంగా ప్రణాళిక ఉండాలి. దీన్ని 120 నుంచి 130 రోజుల పాటు చేయడం కారణంగా జిల్లాకు రావాల్సిన వరద జలాలను పూర్తిస్థాయిలో తీసుకోవడం లేదు. వరద జలాలను రైతులకు అందించేందుకు వీలుగా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జురాల నుంచి కూడా చేపట్టాలి.
Tags:
telangananews