జిల్లాలో నీళ్ల దొంగలు (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జిల్లాలో నీళ్ల దొంగలు (పశ్చిమగోదావరి)

ఏలూరు,మే23 (way2newstv.com): 
జిల్లాలో నీటి దొంగలు పడ్డారు. ఎడా పెడా నీటిని తోడేసస్తున్నారు. నీటిని ట్యాంకర్లలో నింపి అందినకాడికి దోచేస్తున్నారు. జిల్లాలోని ఏలూరు నగర పాలక సంస్థ, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ, మిగిలిన పట్టణాల్లోని శివారు ప్రాంతాలకు నేటికీ ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేస్తున్నారు. కొవ్వూరులోని బ్రిడ్జిపేట, శ్రీనివాసపురం, భీమవరంలోని 14 ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు ఉండగా.. తాడేపల్లిగూడెంలోని కడగట్ల, యాగర్లపల్లి, హౌసింగ్‌ బోర్డు కాలనీ, జువ్వలపాలెం తదితర ప్రాంతాల ప్రజలు ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఏ పట్టణంలో చూసినా తక్కువంటే నాలుగైదు కాలనీల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి పైపులైన్లకు మోటార్లు పెట్టి యథేచ్ఛగా నీటి చౌర్యానికి పాల్పడమూ ఇందుకు కారణంగా తెలుస్తోంది.ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇంటికి ఒక కుళాయి కనెక్షన్‌ ఇస్తారు. భీమవరంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో పురపాలక ఇంజినీరింగ్‌ అధికారులు ఇటీవల తనిఖీలు చేయగా కొన్ని గృహాల వారు ఒక కుళాయికి పన్ను చెల్లిస్తూ రెండేసి కనెక్షన్లతో నీటిని లాగేస్తున్నట్లు గుర్తించారు. ఇలా 1250 ఉన్నట్లు బహిర్గతమైంది. ఈ విధంగానే జిల్లాలోని అన్ని పట్టణాల్లోనూ ఉంటాయని భావించిన అధికారులు ఆ దిశగా తనిఖీలు చేయగా వేల సంఖ్యలో అనధికార కుళాయిలున్నట్లు వెలుగుచూసింది. 
జిల్లాలో నీళ్ల దొంగలు (పశ్చిమగోదావరి)


ఇక.. జిల్లాలోని ఏ పట్టణంలో చూసినా బహుళ అంతస్తు భవనాలు, హోటళ్లు, ప్రైవేటు విద్యాసంస్థలు, ఇబ్బడిముబ్బడిగా దుకాణ సముదాయాలున్నాయి. వీటిలో ఎక్కువగా ఉన్నవి గృహావసరాలను తీర్చే కుళాయి కనెక్షన్లే. ముందుగా దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలి. అయితే... అధికారులకు, కొందరు సిబ్బందికి ఖాళీ లేకపోవడంతో దరఖాస్తుననుసరించి కుళాయి మంజూరు చేస్తున్నారు. ఇంతకీ అది గృహావసరానికే వినియోగిస్తున్నారో, వేరే వాటికో ఉపయోగిస్తున్నారో గుర్తించే వారు ఉండకపోవడంతో యథేచ్ఛగా నీటిని వాడేసుకుంటూ పురపాలక సంఘాల ఆదాయానికి గండికొడుతున్నారు.జిల్లాలోని అన్ని పట్టణాల్లో 90 వేలకు పైగా కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. మూడేళ్ల క్రితం పట్టణాల్లో అక్రమ కుళాయి కనెక్షన్లపై సర్వే చేయగా 2875 అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. తర్వాత రాజకీయ ఒత్తిళ్ల నడుమ గుర్తింపు ప్రక్రియ నిలిపివేశారు. ఇక పట్టణాల్లో అరకొరగా నీటి మీటర్లు ఉండగా అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పర్యవేక్షించే వారు లేరు. దాంతో నీటి చౌర్యం నిరంతరం కొనసాగి మనిషికి 70 లీటర్లు అందని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని అన్ని పట్టణాలకు 112 ఎంఎల్‌డీలు నీరు రోజూ సరఫరా చేస్తుండగా పైపులైన్ల మరమ్మతులు, కుళాయిలకు బిరడాలు లేకపోవడం తదితర కారణాలతో నిత్యం 12 ఎంఎల్‌డీల నీరు వృథా అవుతున్నట్లు అంచనా.జిల్లాలో 840 వరకు బహుళ అంతస్తు భవంతులు ఉన్నాయి. ఒక్కో దాంట్లో 30 నుంచి 40 వరకు కుటుంబాలు నివసిస్తుంటాయి. అక్కడ సాధారణ గృహ కనెక్షనే ఉంటుంది. వాటిని పురపాలక చట్టం 1965, సవరణ చట్టం 1971ను అనుసరించి క్రమబద్ధీకరించాల్సి ఉంటుంది. అయిదు వేల లీటర్ల వరకు నీరు వినియోగిస్తే రూ.26,250 చెల్లించాలి. 20 వేల లీటర్ల పైబడి అయితే రూ.63 వేలు, పరిశ్రమలు, కర్మాగారాలకు పది వేల లీటర్లకు రూ.52,500, 25 లక్షల లీటర్లకు మించి వాడితే రూ.5.25 లక్షలు చెల్లించాలి. అలాగే హోటళ్లు, వ్యాపార సముదాయాలు, రెస్టారెంట్లు, భోజనశాలలు, పారిశ్రామిక సంస్థలు, ఆసుపత్రులు, బహుళ అంతస్తు భవనాల్లో తాగునీటి వినియోగంలో మీటర్లు తప్పనిసరి. ప్రతి వెయ్యి లీటర్లకు రూ.5 చొప్పున చెల్లించాలి. ఒకవేళ మీటరు పనిచేయకపోతే రెండ్రోజుల్లో బాగు చేయించాలి. దీర్ఘకాలం ఉపయోగంలో లేకపోతే పురపాలక చట్టాన్ని అనుసరించి గతేడాది ఆ కనెక్షను నుంచి పన్ను రూపంలో ఎంత వసూలు చేశారో అంత రాబట్టాలి.ప్రస్తుతం జిల్లాలోని పట్టణాల్లో ఉదయం, సాయంత్రం గంట పాటు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఆ సమయంలో విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని ఆయా పట్టణాధికారులు విద్యుత్తు శాఖకు విజ్ఞప్తి చేయడంతో 30 నిమిషాల పాటు ఆపేస్తున్నారు. పట్టణాల్లో నూటికి 80 శాతం ఇళ్ల వద్ద కుళాయిలకు మోటార్లు అమర్చారు. కొందరు రెండు హార్సు పవర్‌ ఉన్న వాటిని ఏర్పాటు చేయడంతో పైపులైన్‌లో నీటిని పూర్తిగా లాగేస్తున్నాయి. దీంతో శివారు ప్రాంతవాసులు కుళాయి నీటిని పూర్తిగా మరిచిపోయి ట్యాంకరు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు.