స్వార్థానికి బలి (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్వార్థానికి బలి (కృష్ణాజిల్లా)

కైకలూరు,మే 23 (way2newstv.com):  
ప్రపంచ ప్రఖ్యాత కొల్లేరు సరస్సు కనుమరుగవ్వబోతోందా అనే ప్రశ్నకు స్థానికంగా చోటుచేసుకుంటున్న పరిస్థితులు అద్దం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రాధాన్యమున్న 14 రకాల చిత్తడి నేలల్లో కొల్లేరు నేలలు ప్రత్యేకమైనవి. ఆ సారవంతమైన నేలలు ప్రస్తుతం ఉప్పు కోరల్లో చిక్కుకుంటున్నాయి. దేశంలోని ఏ ఇతర సరస్సుకూ జరగని నష్టం కొల్లేరుకు జరుగుతోంది. ఏటా 20 శాతం మేరకు ఆక్రమణలు పెరిగిపోవడమే ఇందుకు నిదర్శనం. కొట్టేసిన చెరువులకు గట్లు వేసేస్తున్నారు. చమురు యంత్రాలు, భారీవాహనాలు, మేతలు, మందులు, విషపదార్థాలు.. యథేచ్ఛగా సరస్సులోకి చొరబడుతున్నాయి. కృత్రిమ సాగుకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. ఫలితంగా కొల్లేరు వన్యప్రాణి అభయారణ్య స్వరూపమే పూర్తిగా మారిపోతోంది.2006లో చేపట్టిన కొల్లేరు ఆపరేషన్‌ తర్వాత కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొల్లేరును క్రమంగా సాగులోకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా పరిధిలో 50 శాతం, పశ్చిమ గోదావరి జిల్లాలో 90 శాతం సరస్సు ఆక్వాసాగులోకి వచ్చినట్లు అంచనా. గతంతో పోల్చితే మండవల్లి మండలంలో కృత్రిమ సాగు పూర్తిగా నిలిచిపోయింది. కానీ కైకలూరు మండలంలోని లంక గ్రామాల్లో విషవృక్షంలా విస్తరిస్తోంది. వంద.. రెండు వందల్లో కాదు.. ఏకంగా ఏడు వేల ఎకరాలకు పైగా చేపలు, రొయ్యల సాగు జరుగుతోంది. రాజకీయ నాయకులు, అటవీ శాఖాధికారుల అండదండలతోనే ఇక్కడ ఇష్టారాజ్యంగా సాగు సాగుతోంది. 

స్వార్థానికి బలి (కృష్ణాజిల్లా)

పలు గ్రామాల్లో మంచినీటి చెరువుల పేరుతో తవ్విన వాటికి కూడా వేలం పాటలు నిర్వహించి చేపలను సాగు చేస్తున్నారు. కాంటూర్‌ పరిధిలో గట్లను నిర్మించి సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నత్తగుల్లపాడు, శృంగవరప్పాడు, కొల్లేటికోట, ఆలపాడు, పందిరిపల్లిగూడెం, పెంచికలమర్రు, కొట్టాడ, గుమ్మళ్లపాడు, పల్లెవాడ గ్రామాల్లో భారీ ఎత్తున సాగు జరుగుతున్నా అధికారులకు కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే సాగితే 2006లో కొట్టేసిన ప్రతి చెరువులో కృత్రిమసాగు మొదలయ్యే ప్రమాదముంది.2006 కొల్లేరు ఆపరేషన్‌ తర్వాత జీవో 120తో అభయారణ్యాన్ని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొల్లేరు ముఖద్వారాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి వస్తువులు, యంత్రాలు, మేతలు, వాహనాలు చొరబడనివ్వకుండా అటవీశాఖ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కొల్లేరులోనికి ఎటువంటి వాహనం, మేతలు, ఇతర వస్తువులు వస్తున్నా అందుకు సంబంధించిన పక్కా పత్రాలు ఉండాలి. లేకుంటే వాటిని సరస్సులోనికి అనుమతించకూడదు. ప్రస్తుతం కొల్లేరులో చెక్‌పోస్టులు పేరుకు మాత్రమే నడుస్తున్నాయి. వీటిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సరస్సులోకి యథేచ్ఛగా అక్రమ రవాణ సాగిపోతోంది. ముఖ్యంగా నిషేధిత ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌, తాబేళ్లు, అరుదైన పక్షుల అక్రమ రవాణాను అడ్డుకునే వారే కరవయ్యారు. కొల్లేరులోకి ఏవి వెళుతున్నాయో తెలియాలంటే చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది ఉండాలి. కానీ ఈ సిబ్బంది అసలు కనిపించరు. ప్రస్తుతం కొల్లేరు పరిధిలో జరుగుతున్న ప్రతి అక్రమం వెనుక అటవీ శాఖాధికారుల పాత్ర ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.మూడేళ్లుగా కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో విస్తరిస్తున్న రొయ్యల సాగుతో భారీ ఎత్తున విషతుల్యంగా మారిన ఉప్పునీరు సరస్సులోకి వచ్చి చేరుతోంది. రొయ్యల సాగులో వాడే ఎంతో గాఢత కలిగిన రసాయన మందులు, కలుషితమైన నీటిని కనీసం శుద్ధి చేయకుండా నేరుగా కొల్లేరులోని విడుస్తున్నారు. మంచినీటి సరస్సుగా ఉన్న కొల్లేరు క్రమంగా ఉప్పునీటితో నిండిపోతోంది. ఈ నీటిలోని విషపదార్థాల వల్ల సరస్సుకే వన్నెతెచ్చిన నల్లజాతి చేపలకు ముప్పు వాటిల్లుతోంది. ఏటికేడు ఇక్కడ మత్స్య సంపద తరిగిపోవడమే ఇందుకు నిదర్శనం. వేల కిలోమీటర్ల దూరంనుంచి ఇక్కడి మత్స్యసంపద కోసం వచ్చే పక్షులకు గడ్డుకాలం నడుస్తోంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే సరస్సు ఎండిపోయి పక్షులకు ఆహారం లేక చనిపోతున్నాయి. సమీప గ్రామాల్లోని చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను నేరుగా కొల్లేరులోనే డంప్‌ చేస్తున్నారు. అడుగడుగునా అక్రమాలతో కొల్లేరు ఎటుపోతోందన్న సందేహం పర్యావరణ వేత్తలను, పక్షుల ప్రేమికులను తొలిచి వేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న చర్యలను అటవీ శాఖాధికారులు కనీస చర్యలు పాటించకపోవడం కలవరపరుస్తోంది. మారుతున్న కొల్లేరు రూపురేఖలపై రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సరస్సులోని సెంటు భూమిని తవ్వినా సహించని అటవీ శాఖాధికారులు ప్రస్తుతం మౌనంగా ఉండిపోతున్నారంటే వారిపై ఏ స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్ఛు ఓట్ల రాజకీయాలను పక్కన పెట్టి ప్రపంచ ప్రఖ్యాత కొల్లేరును భావితరాలకు సజీవంగా అందించేందుకు నాయకులు కృషి చేయాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.