తిరువూరు, మే 3 (way2newstv.com):
గిరిజన సంక్షేమ శాఖ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య సేవలందించేందుకు అంతంతమాత్రపు చర్యలే తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిపై పర్యవేక్షణకు నియమించిన ఆరోగ్య కార్యకర్తలకు వైద్య పరికరాలను ఇప్పటి వరకూ అందించలేదు. విస్సన్నపేట, న్యూస్‌టుడే: జిల్లాలోని విస్సన్నపేట (కొండపర్వ)లో తొలుత గిరిజన సంక్షేమ శాఖ 5 నుంచి 10వ తరగతి వరకు చదివే బాలికలకు ప్రత్యేకంగా ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి, నిర్వహిస్తోంది. 2016-17 విద్యాసంవత్సరం నుంచి బాలురకు విస్సన్నపేట, జగ్గయ్యపేట, ఉయ్యూరు, బాలికలకు మైలవరం, నందిగామ, కొండపల్లిలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఇక్కడ తొలి విద్యాసంవత్సరం 3,4,5 తరగతులు ఏర్పాటు చేసి, విద్యార్థులకు ఎటువంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించకుండా తరగతికి 40 మంది చొప్పున పాఠశాలకు 120 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. 2017-18 విద్యాసంవత్సరంలో 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు 6వ తరగతి, గత విద్యాసంవత్సరంలో 7వ తరగతి అవకాశం కల్పించారు. రానున్న విద్యాసంవత్సరంలో 8వ తరగతి ఏర్పాటుచేయనున్నారు.
వైద్యం అంతంత మాత్రం (కృష్ణాజిల్లా)
ఆయా తరగతులకు 40మంది చొప్పున ప్రతి పాఠశాలలో అవకాశం కల్పించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం ఆరు గురుకుల పాఠశాలల్లో కలిపి జిల్లావ్యాప్తంగా గత విద్యాసంవత్సరం 1,200మంది విద్యార్థులు చదవగా ప్రస్తుతం వీరి సంఖ్య పెరగనుంది.గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత విద్య, వసతి, దుస్తులు, పుస్తకాలు తదితర అన్ని సదుపాయాలు కల్పించినా, వారికి అందించే వైద్యసేవల విషయంలో నామమాత్రపు చర్యలే చేపట్టింది. పాఠశాలలు ఏర్పాటు చేసిన తొలినాళ్లలో ప్రతి బడిలోనూ విద్యార్థుల ఆరోగ్య బాధ్యతల పర్యవేక్షణను ఆప్రాంతానికి చెందిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులకు అప్పగించారు. నెలకోమారు వైద్యులు పాఠశాలలకు వెళ్లి, పిల్లలకు పరీక్షలు చేస్తున్నారు. తరచూ ఆరోగ్య కేంద్రానికి చెందిన ఏఎన్‌ఎంలు పాఠశాలను సందర్శించి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని విచారిస్తున్నారు. 3వ తరగతి స్థాయిలో ఉండే చిన్నపిల్లలు పాఠశాలల్లో చేరుతుండటంతో తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతుండటం వల్ల ఉపాధ్యాయులకు అవస్థలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పాఠశాలల్లోనే ఉండి విద్యార్థులకు సేవలందించే దిశగా గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఒప్పంద విధానంలో ఆరోగ్య కార్యకర్తలను నియమించింది. వీరు నిరంతరం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని విచారిస్తూ, అనారోగ్య సమస్యలు తలెత్తితే తమ పాఠశాల బాధ్యతలు చూస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాల్సి ఉంది.విద్యార్థులకు అనారోగ్య సమస్య తలెత్తి, అత్యవసర పరిస్థితి ఎదురైతే పాఠశాలల అధికారులు, సిబ్బంది అగమ్యగోచర పరిస్థితిని ఎదుర్కొనాల్సిన దుస్థితి. పాఠశాలల్లో పిల్లల ఆరోగ్యం, పారిశుద్ధ్య సేవలందించేందుకు ఉన్నతాధికారులు ఏడాదికి కేవలం రూ.5 వేలు మాత్రమే కేటాయిస్తున్నారు. ఈ నగదుతో పారిశుద్ధ్య జాగ్రత్తలకు అవసరమైన ఫినాయిల్, చీపుళ్లకే చాలని పరిస్థితి ఉండగా, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి నిధుల లేమి ఎదురవుతోంది. ఒప్పంద విధానంలో నియమించిన ఆరోగ్య కార్యకర్తలకు నెలకు రూ.6వేల జీతాన్ని, అదీ ఆరు మాసాలకోమారు చెల్లిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం అక్టోబరు నుంచి ఇప్పటివరకు వీరికి జీతాల చెల్లింపు లేదు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన పరికరాలను నేటి వరకు అందించలేదు. ప్రతి కార్యకర్తకూ విద్యార్థులను పరీక్షించేందుకు కనీసం స్టెతస్కోప్, రక్తపరీక్ష పరికరాలు, బరువు పరిశీలించే పరికరం తదితరాలను అందించాల్సి ఉన్నా, నేటి వరకు ఒక్కటీ లేకపోవటంతో ఒట్టి చేతులతో విద్యార్థులను పరీక్షిస్తున్నారు. పిల్లలకు సాధారణ అనారోగ్య సమస్య తలెత్తిన సందర్భాల్లో వారిని ఏదేని వాహనాల్లో తమ పాఠశాలకు అనుబంధంగా ఉన్న ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు అయ్యే వ్యయం చెల్లించే పరిస్థితి లేకపోవటంతో వీరిని వైద్యశాలకు ఎలా తరలించాలో తెలియని పరిస్థితి ఉంది.