విపక్షాలతో రాహుల్ కు పోసగని మైత్రి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విపక్షాలతో రాహుల్ కు పోసగని మైత్రి

న్యూఢిల్లీ, మే 4, (way2newstv.com)
కాంగ్రెస్ పార్టీకీ నాయ‌క‌త్వం ఇవ్వ‌డానికీ, రాహుల్ గాంధీని ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌తిపాదించ‌డానికీ ప్ర‌తిప‌క్షాల‌కు ఏమాత్ర‌మూ ఇష్టం లేద‌నేది ఇప్పుడు మ‌రింత స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది! గతవారం రోజులుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో విప‌క్షాల‌కు చెందిన ప్ర‌ముఖ నాయ‌కుల ప్ర‌క‌ట‌న‌లు చూస్తుంటే… కాంగ్రెస్ ని ల‌క్ష్యంగా చేసుకునే ఎదురుదాడికి దిగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ఇదే స‌మ‌యంలో, అప్ర‌క‌టితంగానే విప‌క్షాల మ‌ధ్య ఒక‌ర‌క‌మైన భావ‌సారూప్య‌త కూడా క‌నిపిస్తోంది. యూపీలో ఎస్పీ, బీఎస్సీలు కాంగ్రెస్ తీరు మీద తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో, కాంగ్రెస్ ప‌ట్టు త‌క్కువ‌ ఉన్న నియోజ‌క వ‌ర్గాల్లో కొంత బ‌ల‌హీన అభ్య‌ర్థుల‌ను నిలబెట్టింద‌ని ప్రియాంకా గాంధీ చెప్ప‌డం, ఓటమిని ముందుగానే ఒప్పుకుంటున్న‌ట్టు అని అఖిలేష్ యాద‌వ్ విమ‌ర్శించారు. భాజ‌పా కాంగ్రెస్ ల మ‌ధ్య ఉన్న లోప‌యికారీ ఒప్పందం బ‌య‌ట‌ప‌డింద‌ని మాయావ‌తి అన్నారు. 


విపక్షాలతో రాహుల్ కు పోసగని మైత్రి

నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఒమ‌ర్ అబ్దుల్లా స్పందిస్తూ… కాశ్మీర్ లో నామ్ కే వాస్తే అన్న‌ట్టుగానే అభ్య‌ర్థుల‌ను కాంగ్రెస్ నిల‌బెట్టింద‌నీ, బీజేపీ త‌ర‌ఫున ప్ర‌ధాని మోడీ, అమిత్ షాలు మిన‌హా అంద‌రూ ప్ర‌చారానికి వ‌స్తే.. వారికి ధీటుగా కాంగ్రెస్ నుంచి ఎవ్వ‌రూ ప్ర‌చారం చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ఒక ఇంట‌ర్వ్యూలో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కూడా రాహుల్ గాంధీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. భాజ‌పా వ్య‌తిరేక కూట‌మికి రాహుల్ తూట్లు పొడుస్తున్నార‌ని విమ‌ర్శించారు. భాజ‌పాతో బ‌లంగా పోరాడుతున్న మ‌మ‌తా బెన‌ర్జీ, చంద్ర‌బాబు నాయుడు లాంటి వాళ్ల‌కి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తోంద‌న్నారు. త‌మ‌తో పొత్తు, సీట్ల స‌ర్దుబాటు అని చెప్పి, చివ‌రి నిమిషంలో రాహుల్ మాట మార్చేశార‌ని విమ‌ర్శించారు. ఓ బ‌హిరంగ స‌భ‌లో మ‌మ‌తా బెన‌ర్జీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వెన‌క ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఉంద‌ని విమ‌ర్శించారు. భాజ‌పా వ్య‌తిరేక కూట‌మికి అవ‌స‌ర‌మైన ప్ర‌ముఖ నేత‌లంతా ఇప్పుడు కాంగ్రెస్ తీరుపై గుర్రుగా ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. ఎన్నిక‌ల ముందు… క‌ర్ణాట‌క‌లో, ప‌శ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ తో స‌హా ఇత‌ర పార్టీల మ‌ధ్య ఒక భావ‌సారూప్యం క‌నిపించింది. భాజ‌పాకి ప్ర‌త్యామ్నాయ కూట‌మి ఇదే అన్న‌ట్టు క‌నిపించారు. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది కానీ, ఇప్పుడు కాంగ్రెస్ తీరును ఏక‌ప‌క్షంగా అంద‌రూ విమ‌ర్శిస్తున్న ప‌రిస్థితి. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాక ప‌రిస్థితులు ఎలా మారుతాయో తెలీదుగానీ… విప‌క్ష కూట‌మి అంటూ ఏర్ప‌డితే దానికి కాంగ్రెస్ నాయ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌నే వాతావ‌ర‌ణం ప్ర‌స్తుతానికి ఉంది.